గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్‌తో పాటు పౌరుల అవసరాలను తీర్చడం కోసం నాణ్యమైన సేవలను అందించే సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత పై కూడా సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Revanth Reddy
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు. సరస్వతి దేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉందని, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జిల్లాల పర్యటనలో సైతం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారని తెలిపారు. హైదరాబాదులో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించామన్నారు. నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తీర్చేందుకు ముందుండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూషించడం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్, సభ్యుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు. తాజాగా గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు.
సీఎం రెవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు . ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం పని చేసినవారికే ఈ కమిటీలో ప్రాధాన్యత దక్కాలన్నారు. త్వరలో జరిగే పార్లమొంట్ ఎన్నికల్లో కాంగ్రస్ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గ అభివృద్దికి 10 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బాధ్యతలను చేపట్టిన నెల రోజుల కాలంలోనే పాలనపై ఆయన తనదైన స్పష్టమైన ముద్రను వేయగలిగారు. పార్టీలోని సీనియర్లందరికీ తగు గౌరవం ఇస్తూ… పార్టీలో అంతర్గతంగా ఎలాంటి అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కనీసం 12 స్థానాలను కైవసం చేసుకునే దిశగా రేవంత్, పార్టీ సీనియర్లు టార్గెట్ నిర్దేశించుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు. లోక్ సభ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభను నిర్వహించనున్నట్టు ఆ జిల్లా నేతలకు చెప్పారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు.
తెలంగాణలో గత ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం పేరిట నాడు కేసీఆర్ సర్కారు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా, ఆయన జిల్లాల పునరీకరణ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి 33 జిల్లాలు అవసరం లేదన్న భావనతో ఉన్నారు. 33 జిల్లాల్లో బాగా చిన్న జిల్లాలను కలిపేసి, జిల్లాల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముంది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమె ఏపీనా లేక తెలంగాణనా అన్న చర్చ కొనసాగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టి ఆ ప్రాంతంలోనే వైఎస్ షర్మిల కార్యకలాపాలు సాగించారు. తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో ఆమెను ఏపీకి నియమిస్తున్నారన్న ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు ఆమె ఇటీవలి వరకు తెలంగాణలోనే కదా ఉన్నారు. తెలంగాణకే పరిమితం అవుతారన్న అంచనాలు కూడా వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో వైఎస్ షర్మిలపై రేవంత్ స్పష్టత ఇచ్చారు. వైఎస్ షర్మిల తమ పార్టీకి చెందిన ఏపీ నేత అని తేల్చేశారు. షర్మిల ఏపీకి చెందిన నాయకురాలని రేవంత్ కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్ వేస్తామని వెల్లడించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన కమిషన్ వేస్తామని చెప్పారు. తెలంగాణ అంతటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరులా చేస్తామని స్పష్టత ఇచ్చారు. కచ్చితమైన ప్రాతిపదికతో జిల్లాలు మారుస్తామన్నారు. డీవియేషన్ ఉండొచ్చు, వయోలేషన్ ఉండొద్దు కదా అని రేవంత్ ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటు విషయంలో కేసీఆర్ సరైన విధానం అవలంబించ లేదన్నారు. ఎడాపెడా జిల్లాలను పెంచేశారని రేవంత్ విమర్శించారు. అదెలా ఉందంటే.. ఆ జిల్లాల పేర్లను కూడా కేసీఆర్ చెప్పలేరని ఎద్దేవా చేశారు. మూడు మండలాలకు ఓ జిల్లా చేశారని సీఎం వివరించారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం ఏడు జిల్లాల పరిధిలో ఉందన్న రేవంత్.. అక్కడి ఎంపీ ఏడుగురు కలెక్టర్లతో మాట్లాడాలా అని ప్రశ్నించారు.
రాష్ట్రమంతటా 2050 నాటికి పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన రివ్యూ నిర్వహించారు. తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందన్నారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించిన ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అయితే.. పది రోజుల్లో మొదటి రెండు మూడు రోజులు.. చివరి రోజుల్లో భారీగా ప్రజలు తమ దరఖాస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజాపాలన గడువు ముగియగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కలిపి మొత్తంగా సుమారు కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ప్రజాపాలనలో మహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పది రోజుల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు.. ప్రత్యేక సాప్ట్‌వేర్‌లోకి అప్లోడ్ చేయనున్నారు. ఈ ప్రక్రియను ఈనెల 17న పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత.. ఆరు గ్యారెంటీల్లోని పథకాల లబ్దిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అయితే.. ఆధార్ కార్డులో మార్పుల వల్లనో.. లేదా స్థానికంగా అందుబాటులో లేకపోవటం వల్లో చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వలేకపోయారు. అయితే.. అలాంటి వాళ్లు.. తమకు పథకాలు వర్తించవేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Read Also..






Total views : 91057