సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు సిద్ధిపేట జిల్లా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎయిరా క్రియేటర్స్ డ్యాన్స్ అండ్ కల్చరల్ సొసైటీ సహకారంతో సిద్ధిపేట ప్రధాన బస్ స్టాండ్లో నిర్వహించిన భారీ డ్యాన్స్ ఫ్లాష్ మాబ్ విజయవంతంగా ముగిసింది. సుమారు వంద మంది విద్యార్థులు ఒకే వేదికపై ఆకట్టుకునే నృత్య ప్రదర్శన చేశారు. సామాజిక సందేశాలను కళాత్మకంగా ప్రజలకు చేరవేశారు. ఈ ఫ్లాష్ మాబ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విద్యార్థుల ప్రదర్శనలను చప్పట్లతో అభినందించారు. వినోదంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ క్రమశిక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎయిరా క్రియేటర్స్ డ్యాన్స్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tag: