ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ విధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీలోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ఎక్సైజ్ విధానంలో భాగంగా.. ఎయిర్‌పోర్టుల్లో వైన్ షాపులు, బార్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 386 ప్రకారం.. తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాల్లో, ప్లాజాల్లో మద్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. విమాన సర్వీసులు అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా ఉంటాయనే ఉద్దేశంతో.. ఈ దుకాణాలను 24 గంటలూ రౌండ్ ది క్లాక్ నడిపేందుకు అనుమతించారు. అయితే ఈ లైసెన్స్ ఎవరికి పడితే వారికి రాదు. ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ సిఫారసు చేసిన దరఖాస్తుదారులకు మాత్రమే ఎక్సైజ్ శాఖ ఈ పర్మిట్లు మంజూరు చేస్తుంది. ఒకే లైసెన్స్ కింద బార్లకు గరిష్టంగా మూడు సర్వింగ్ పాయింట్లు, షాపులకు మూడు కౌంటర్ల వరకు అవకాశం కల్పించారు.
ఇక ఎయిర్‌పోర్ట్ మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజులను కూడా భారీగానే నిర్ణయించారు. వైన్ షాపుల దరఖాస్తు రుసుముగా 2 లక్షల రూపాయలు, వార్షిక ఎక్సైజ్ పన్నుగా ఏకంగా ఒక కోటి రూపాయలను ఖరారు చేశారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బార్లను రెండు కేటగిరీలుగా విభజించారు. ఏడాదికి 20 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణించే ఎయిర్‌పోర్టుల్లోని పెద్ద బార్లకు 25 లక్షల రూపాయలు.. 20 లక్షల కంటే తక్కువ మంది ఉండే చిన్న బార్లకు 15 లక్షల రూపాయలను వార్షిక పన్నుగా నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం ఎయిర్‌పోర్ట్ షాపులకు పర్మిట్ రూమ్ సదుపాయం ఉండదు. ప్రయాణికుల రాకపోకలు, ఆదాయ వనరులను బట్టి.. ఈ నూతన పాలసీని మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మళ్లీ సమీక్షించనుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టుల్లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.





Total views : 180103