Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home National ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.

ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.

by CVR NEWS

యువతరం సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్‌ భారత్‌ దిశగా సాగే దేశ ప్రయాణానికి యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఏ తరం వారైనా దేశ బాధ్యతను విస్మరించొద్దని సూచించారు.ఐఐటీ దిల్లీ గ్రాడ్యుయేట్లను కలుసుకోవటం చాలా సంతోషంగానూ, గర్వంగా ఉందన్నారు. వేగంగా మారుతున్న బయట ప్రపంచాన్ని కుతూహలంగా గమనించాలని సూచించారు. నిత్య విద్యార్థిలా సాంకేతిక రంగంలోని మార్పులను నేర్చుకోవాలన్నారు. రాబోయే 20-30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, అందువల్ల జీవితంలో ఎప్పుడూ కుతూహలం కలిగి ఉండాలని మోదీ విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు.

జీవితంలో పెద్ద సవాలు ఎదురైనప్పుడు దాన్ని చూసి భయపడవద్దన్నారు. ఆ సవాలును చిన్న చిన్న భాగాలుగా విడదీసి చూస్తే పరిష్కారం దొరుకుతుందన్నారు. కేవలం ప్రశ్నలు అడగడంతో ఆగిపోకుండా పరిష్కారాలను కనుగొనే ధైర్యం కూడా ఉండాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి ప్రయాణంలో యువత కూడా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. వచ్చే 30-35 ఏళ్లలో మీరు ఏం చేస్తున్నారన్నదే.. వికసిత్‌ భారత్‌ను నిర్ణయిస్తుందన్నారు. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే.. ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలని సూచించారు.

విద్య, కెరీర్‌తో పాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. విజయాన్ని సాధించే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అలాగే గోబర్ధన్ యోజనను ప్రస్తావిస్తూ.. ఆవు పేడ, వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే దిశగా భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు రైతులకు కొత్త అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు దీన్‌దయాల్‌ శర్మ స్వర్ణ పతకం, డైరెక్టర్‌ స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. పతకాలు స్వీకరించిన వారిలో ఒకరిద్దరే మహిళలు ఉన్నారని, వీరి సంఖ్య ఎక్కువగా ఉంటే బాగుండేదని మోదీ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐఐటీ దిల్లీ సోనిపత్‌ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత సూపర్‌ కంప్యూటింగ్‌ కేంద్రమైన ‘పరం ప్రజ్ఞ’ను ఆయన ప్రారంభించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: