Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు.

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు.

by CVR NEWS

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధమైంది. రష్యా, ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా సెనెట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. లిండ్సే గ్రాహమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు 86 మంది సెనెటర్లు అనుకూలంగా ఓటు వేయగా.. 11 మంది వ్యతిరేకించారు. ముఖ్యంగా రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అయితే ఇది వెంటనే అమల్లోకి వచ్చే టారిఫ్ కాదు. ప్రతినిధుల సభ ఆమోదం, ఆ తర్వాత అధ్యక్షుడి చర్య కీలకం. మరి ఈ బిల్లు చట్టంగా మారితే భారత్‌పై ప్రభావం ఎంత? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రకంపనలు రేపుతుందన్ని చర్చనీయాంశంగా మారింది.

రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది. లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026కు సెనెట్ 86-11 ఓట్లతో ఆమోదం తెలిపింది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు ద్వారా మాస్కో ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అధ్యక్షుడికి కొన్ని దేశాల దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి.రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో భారత్, చైనా కీలకంగా ఉన్నాయి. అందుకే ఈ బిల్లు చట్టరూపం దాల్చి.. అధ్యక్షుడు దాన్ని అమలు చేస్తే.. ఈ రెండు దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై భారీ సుంకాల ముప్పు ఏర్పడుతుంది. అయితే 100 శాతం టారిఫ్ ఆటోమేటిక్‌గా పడదు. అధ్యక్షుడికి ఆ అధికారం లభిస్తుంది.. దాన్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలన్నది అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ఇక్కడే భారత్‌కు అసలు సవాలు. అమెరికా.. భారత్‌కు అత్యంత కీలకమైన ఎగుమతి మార్కెట్లలో ఒకటి. 2025లో భారత్ నుంచి అమెరికాకు వస్తువుల ఎగుమతులు దాదాపు 85 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫార్మా, టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, యంత్రాలు వంటి రంగాలకు అమెరికా మార్కెట్ అత్యంత ముఖ్యమైనది. కాబట్టి 100 శాతం వరకు అదనపు టారిఫ్ విధిస్తే.. భారతీయ ఉత్పత్తుల పోటీతత్వం దెబ్బతినే అవకాశం ఉంది.టారిఫ్ భారం పూర్తిగా అమెరికా దిగుమతిదారులపైనే పడుతుందని చెప్పలేం. భారత ఎగుమతిదారులు ధరలు తగ్గించి కొంత భారాన్ని భరించాల్సి రావచ్చు. లేదంటే అమెరికా దిగుమతిదారులు ఆ భారాన్ని వినియోగదారులపై మోపవచ్చు. అప్పుడు భారత ఉత్పత్తుల ధరలు పెరగడం.. డిమాండ్ తగ్గడం.. ఆర్డర్లు ఇతర దేశాలకు మళ్లే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ బిల్లుకు మరో కోణం కూడా ఉంది. రష్యన్ చమురుపై ఒత్తిడి పెరిగితే.. ప్రపంచ మార్కెట్లో రష్యా సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రత్యామ్నాయ సరఫరాల కోసం భారత్, చైనా వంటి దేశాలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికా తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయాల్సి రావచ్చు. సరఫరా అంతరాయం పెరిగితే అంతర్జాతీయ క్రూడ్ ధరలపై కూడా ఒత్తిడి రావచ్చు. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా భారత్ చమురు దిగుమతి బిల్లు పెరుగుతోంది.
ఈ నిర్ణయం కేవలం భారత్, చైనాలకు మాత్రమే పరిమితం కాదు. రష్యన్ ఎనర్జీపై ఆధారపడే ఇతర దేశాలపైనా అమెరికా ఒత్తిడి పెరగొచ్చు. ప్రపంచ చమురు వాణిజ్యంలో మార్పులు రావచ్చు. షిప్పింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలపై కూడా అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యా చమురుకు ప్రత్యామ్నాయ సరఫరాల కోసం దేశాలు పోటీ పడితే.. ప్రపంచ ఎనర్జీ మార్కెట్ మరింత అస్థిరంగా మారే అవకాశం ఉంది.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందింది. 2026 ఫిబ్రవరిలో ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఒక ఫ్రేమ్‌వర్క్‌కు చేరుకున్నాయి. అందులో అమెరికా మార్కెట్‌కు భారత్‌కు ప్రాధాన్య ప్రాప్యత, సరఫరా గొలుసుల బలోపేతం వంటి అంశాలు ఉన్నాయి. అదే సమయంలో భారత్ వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ, విమానాలు, టెక్నాలజీ, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది.ఇప్పుడు భారత్ ముందున్నది రెండు వైపుల సవాలు. ఒకవైపు చౌకైన రష్యన్ చమురు ద్వారా దేశీయ ఇంధన అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చుకోవాలి. మరోవైపు అమెరికా వంటి కీలక ఎగుమతి మార్కెట్‌ను కాపాడుకోవాలి. రష్యన్ చమురును పూర్తిగా వదులుకుంటే ప్రత్యామ్నాయ చమురు ఖరీదు పెరిగే అవకాశం ఉంది. కొనసాగిస్తే అమెరికా టారిఫ్ ముప్పు ఎదురవుతుంది. అందుకే భారత్ తన ఇంధన భద్రత, ఎగుమతి ప్రయోజనాలు, అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు—ఈ మూడింటినీ సమతుల్యం చేయాల్సిన పరిస్థితి సవాల్ గా మారనుంది.
అయితే ప్రస్తుతానికి ఒక విషయం స్పష్టం. సెనెట్ ఆమోదం అంటే 100 శాతం టారిఫ్ వెంటనే అమల్లోకి వచ్చినట్టు కాదు. బిల్లు తదుపరి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాలి. ఆ తర్వాత అధ్యక్షుడి సంతకం, అమలు నిర్ణయాలు కీలకం. కాబట్టి రాబోయే రోజుల్లో వాషింగ్టన్‌లో జరిగే పరిణామాలు భారత్‌కు అత్యంత కీలకమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. భారత్ విషయంలో మాత్రం ఇది కేవలం చమురు కొనుగోళ్ల అంశం కాదు.. ఇంధన భద్రత, ఎగుమతులు, అమెరికాతో వాణిజ్య సంబంధాలు, ప్రపంచ మార్కెట్లపై ప్రభావం అన్నింటినీ కలిపిన పెద్ద వ్యూహాత్మక సవాలు. ఇప్పుడు బంతి అమెరికా ప్రతినిధుల సభ, ఆ తర్వాత అధ్యక్షుడి కోర్టులో ఉంది. బిల్లు పాసైతే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రపంచదేశాల్లో ఉత్కంఠరేపుతోంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: