Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh చేనేతకు అండగా ఎన్డీయే ప్రభుత్వం-చంద్రబాబు.

చేనేతకు అండగా ఎన్డీయే ప్రభుత్వం-చంద్రబాబు.

by CVR NEWS

చేనేత భారతదేశ గర్వకారణమని… ఆ కళను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం… చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చేనేత రంగానికి చేయూతగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని చర్యలు చేపడతామని ప్రకటించారు. దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన కళల్లో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు చంద్రబాబు నాయుడు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… చేనేత కళను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తెలుగు నేత కార్మికుల నైపుణ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని సీఎం పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మన నేత కార్మికులదేనని గుర్తు చేశారు. ఒకప్పుడు చీరాల కర్చీఫ్‌లు విదేశాలకు ఎగుమతి అయ్యేవని… అందుకే చీరాలను మినీ ముంబయిగా పిలిచేవారని చెప్పారు.

రాష్ట్రంలో లక్షా 27 వేల మందికి పైగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా నేత కార్మికులు తెలుగుదేశం పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు చంద్రబాబు. సబ్సిడీపై విద్యుత్ సరఫరా, 50 ఏళ్లకే పెన్షన్, ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని వెల్లడించారు. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సంప్రదాయ చేనేతకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. సంజీవని పథకం ద్వారా 2.50 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని… అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని పాలన అందిస్తామని ఇచ్చిన హామీని రెండేళ్లలోనే నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు.
చేనేత కళను కాపాడుతూ… నేత కార్మికుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయడంతో… చేనేత రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: