Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Latest News లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

by CVR NEWS
లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి...?

రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక అవినీతి తిమింగలం దొరికినప్పుడు కొన్ని రోజుల పాటు మీడియాలో జరిగే హడావిడి, ఆ తర్వాత మరో కొత్త కేసు రాగానే పాత కేసు అటకెక్కడం నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఈ క్రమంలోనే లంచగొండి అధికారులు పట్టుబడినా ఏం కాదులే… అనే ధీమాకు వచ్చేరనేదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది నాటి జీహెచ్ఎంసీ డీఈఈ దివ్యజ్యోతి వ్యవహారం.

అక్టోబర్ 9, 2024న తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది. నాటి జీహెచ్ఎంసీ డీఈఈ దివ్యజ్యోతి అక్రమ సంపాదన, అవినీతి భాగోతాన్ని ఆమె భర్త శ్రీపాద్ స్వయంగా సాక్ష్యాధారాలతో సహా ఏసీబీ అధికారులకు పట్టించారు. ఒక సామాన్యుడు చెబితే సాక్ష్యాలు లేవనో, విచారణ సాగుతోందనో కాలయాపన చేయవచ్చు. కానీ, ఇంట్లోని వ్యక్తే, అందులోనూ కట్టుకున్న భర్తే అన్ని ఆధారాలూ బల్లగుద్ది మరీ చూపిస్తే… ఏసీబీ చర్యలు ఎలా ఉండాలి? ఉరుములు, మెరుపులతో దూసుకెళ్లాలి. కానీ, సీన్ కట్ చేస్తే… ఈ రోజుకు ఆమెను అరెస్టు చేయలేదు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా దివ్యజ్యోతిని అరెస్టు చేయకపోవడం వెనుక అసలు రహస్యం ఏంటి…? భర్తే సాక్ష్యాలిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారన్నదే అసలు ప్రశ్న.

దివ్యజ్యోతిని చట్టం ముందు నిలబెట్టకుండా, అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు అనే ప్రశ్నలకు తెరవెనుక ఒకే ఒక బలమైన సమాధానం వినిపిస్తోంది. ఆమె వెనుక ఉన్నది ఆ శాఖలో అత్యున్నత స్థానంలో కూర్చున్న ఒక పెద్ద అధికారి. ఆ పవర్‌ఫుల్ అధికారి అండదండలు, ఆయనకున్న పట్టుతోనే దివ్యజ్యోతిపై ఈగ వాలకుండా కాపాడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వంలోని పెద్దలకు సదరు ఉన్నతాధికారి అత్యంత ఆప్తుడు కావడం.. ఆయన చెప్పినట్లు వ్యవస్థలు నడవడమే దివ్యజ్యోతికి శ్రీరామరక్షగా మారింది. ఏసీబీలోని ఉన్నతాధికారులు సైతం ఆ శక్తి ఒత్తిళ్లకు తలొగ్గి, జ్యోతి అరెస్టు ఫైల్‌ను పక్కన పెట్టేశారనే ప్రచారం సాగుతోంది.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి, వ్యవస్థపై భయం పోవడానికి కారణం… ఏసీబీ రైడ్స్ తర్వాత జరగాల్సిన ప్రక్రియ సవ్యంగా సాగకపోవడమే. చట్టం ప్రకారం ఏసీబీ రైడ్ జరిగిన వెంటనే… అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలి. 48 గంటలు గడిస్తే సస్పెన్షన్ వేటు వేయాలి. నిర్ణీత గడువులోగా కోర్టులో పక్కా చార్జ్‌షీట్ దాఖలు చేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో మరో కొత్త తిమింగలం పట్టుబడగానే పాత అధికారి కేసు అటకెక్కుతుంది. ప్రాసిక్యూషన్ అనుమతుల పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తారు. లూప్‌హోల్స్ వెతుక్కుని అధికారులు మళ్లీ పోస్టింగులు తెచ్చుకుంటారు. దొరికితే కొన్ని రోజులు సస్పెండ్ అవుతాం… ఆ తర్వాత మళ్లీ సీట్లో కూర్చుంటాం అనే ధీమా అధికారుల్లో వచ్చేసింది.

అవినీతి నిరోధక శాఖ చర్యలు చూస్తుంటే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతోంది. రైడ్స్ జరిగినప్పుడు టీవీల్లో, పేపర్లలో వచ్చే వార్తలు కేవలం ప్రజలను కొన్ని రోజుల పాటు ఎంటర్‌టైన్ చేసే సినిమా స్టోరీల్లా మిగిలిపోతున్నాయే తప్ప, నిజమైన జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదు. భర్తే అన్ని సాక్ష్యాలు ఇచ్చినా దివ్యజ్యోతి లాంటి లంచగొండి అధికారిణి స్వేచ్ఛగా తిరుగుతుంటే… రేపు సమాజంలో ఏ సామాన్యుడు ధైర్యం చేసి లంచగొండులను పట్టించడానికి ముందుకు వస్తాడు…? సామాన్యులు పట్టించిన కేసుల్లో ఇంకెంత అలసత్వం ప్రదర్శిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్యులకు న్యాయం జరిగేదెన్నడు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: