Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

by CVR NEWS
నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు

మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత రెండేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారడం పరిపాలనలో స్థిరత్వం లేకపోవడానికి ప్రధాన కారణంగా మారింది. ఒక అధికారి వ్యవస్థను అర్థం చేసుకునేలోపే మార్పు జరగడంతో ప్రణాళికలు అమలు దశకు చేరక ముందే ఆగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ అభివృద్ధి పూర్తిగా స్థంభించిపోయింది. పాలనలో నిర్లక్ష్యం పెరగడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయితీగా మారినా, గ్రామ స్థాయి సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి పొదిలి పట్టణ అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది. స్థిరమైన పరిపాలన లేకుండా అభివృద్ధి సాధ్యం కాదనే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

పొదిలి నగర పంచాయితీలో ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. పన్నుల రూపంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, అందులో సగం కూడా వసూలు కాలేకపోవడం అధికారుల వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది. ఆదాయం లేకపోవడంతో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా శానిటేషన్ సేవలు, పట్టణ నిర్వహణ పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. మరోవైపు ప్రజలు కూడా అభివృద్ధి లేకపోతే పన్నులు ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనతో పన్నుల వసూళ్లు మరింత తగ్గిపోతున్నాయి. ఒకవైపు ఆదాయం లేదు, మరోవైపు అభివృద్ధి లేదు అన్న చందంగా నగర పంచాయితీ మారింది . ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పారదర్శక పాలన అవసరం. లేకపోతే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.

పొదిలి పట్టణంలో ప్రాథమిక సదుపాయాల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పాత డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. దీంతో వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రహదారుల విస్తరణ, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం పట్టణ అభివృద్ధి ఎంత వెనుకబడిందో తెలుపుతోంది .ఇక రాజకీయ జోక్యం అధికంగా ఉండటం కూడా అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారినిదని స్థానికులు అంటున్నారు . అధికారులు స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా కార్మికుల వేతనాలు కూడా ఆలస్యంగా చెల్లిస్తునట్లు తెలుస్తోంది .

ఈ పరిస్థితుల్లో సమర్థవంతమైన అధికారిని నియమించి, రాజకీయ జోక్యాన్ని తగ్గించి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అభివృద్ధి ఫలాలు చూపగలిగితేనే పొదిలి నిజమైన నగర పంచాయితీగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: