ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3 కోట్ల రూపాయల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని నిందితుడు 8 రోజుల క్రితం పిటిషన్ వేశాడు. తన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన
3 కోట్ల రూపాయల నగదును ఉపయోగించుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఐబొమ్మ రవి కోరగా.. అందుకు కోర్టు ఒప్పుకోలేదు. బ్యాంకు అకౌంట్లను ఉపయోగించుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా.. పైరసీకి పాల్పడుతూ సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించడమే కాకుండా, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడన్న ఆరోపణలపై రవిని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గత ఏడాది నవంబర్‌లో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడికి బెయిల్ లభించింది. అయితే, అరెస్టు సమయంలో పోలీసులు తన ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన 3 కోట్ల రూపాయలు తిరిగి అన్‌ఫ్రీజ్ చేయించాలని కోరుతూ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇమ్మడి రవి పిటిషన్ దాఖలు చేశాడు. తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందని తెలిపాడు.