నిర్మల్ జిల్లా బాసరలో అటవీ శాఖ అధికారులు భారీగా అడవి పందుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. గోదావరి నది వంతెన వద్ద నిర్వహించిన తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సిద్ధిపేటకు వీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న అడవి పందులను బైంసా రేంజ్ కార్యాలయానికి తరలించి పశువైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వాటి వయస్సు, లింగాన్ని నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని వెల్లడించారు. ఒకవేళ ఏవైనా అడవి పందులు మృతి చెంది ఉంటే పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం ఖననం చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు బాసర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శివ వెల్లడించారు.
Tag: