కార్యకర్తలు అధైర్యపడవద్దని అండగా ఉంటానని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గాలిలో 26 వేల మెజారిటీ తో గెలిచానని, కేసీఆర్ గాలిలో కూడా 23 వేల మెజారిటీతో గెలిచానని, కాని ఈ ఎన్నికల్లో ఎమోషనల్ టెంప్ట్ కు గురై మాత్రమే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని గెలుపోటములు సహజమని అన్నారు. గతంలో టెండర్లు పూర్తికాబడిన పనులను పూర్తి చేయాలని, ఆర్థిక శాఖ పూర్వ అనుమతులు వచ్చాకే మంజూరు చేశారని, ఆ పనులను కానసాగించాలని నిధులు లేవనే వంకతో ఆపవద్దని ప్రభుత్వానికి సూచించారు. కార్యకర్తల కష్టాలలో అండగా ఉంటానని, ప్రజాసమస్యల పరిష్కారంలో పోరాటాలకు సిధ్ధంగా ఉన్నానని అన్నారు.
Mahabubnagar
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేటి నుండి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమకున్న సమస్యలను లిఖితపూర్వకంగా ఇస్తూ ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ప్రజా సమస్యలను ఎంతో ఓర్పుగా వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం మొదలైన రోజే ప్రజలనుంచి భారీ స్పందన లభించిందని మొదటి రోజే దాదాపుగా 50 కి పైగా వినతులు వచ్చాయని వీటిలో అధికంగా భూముల కబ్జా, భూముల డబల్ రిజిస్ట్రేషన్, ప్లాట్ల కబ్జాలకు సంబంధించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి వాటి నిర్మాణం మరియు పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు అధికంగా ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన ప్రజల పక్షాన హామీ ఇచ్చారు.
Read Also..
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బగేల్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు, పాలకమండలి చైర్మన్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పాలక మండలి చైర్మన్ చిన్ని కృష్ణయ్య, ఈవో పురేందర్ కుమార్ స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, బిజెపి శ్రేణులు వారి వెంట ఉన్నారు.
Read Also..
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాలానగర్ కూడలి వద్ద వేగంగా వస్తున్న డీసీఎం ఆటో, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు మోతీ ఘనాపూర్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం సంత బాలానగర్ సెంటర్ లో నిర్వహిస్తారు. దీని కోసం చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే సంతకు వచ్చిన కొందరు సరుకులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం ఆటో, బైకును ఢీకొట్టింది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
వారం సంతదినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 4 మంది అక్కడికక్కడే దుర్మరణం కాగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. సంతదినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణలో లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళుతుండగా చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీ కొన్నట్టు స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆగ్రహించిన స్థానికులు డీసీఎం అద్దాలు పగల కొట్టి ఆందోళన చేపట్టారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు పోలీస్ ఎస్కార్ట్ కేటాయించడంతో అది తనకు అవసరం లేదంటూ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలని అన్నారు. తనను గెలిపించిన ప్రజలే తనకు బాడీ గార్డులు అని నిత్యం ప్రజలలో తిరిగే తనకు పోలీసుల అవసరం లేదని ప్రజల అవసరాల కోసం పోలీసులు నిత్యం పని చేస్తే చాలని నిన్న రాష్ట్ర డి ఐ జి చౌహన్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, అడిషనల్ ఎస్పీ రాములకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా వినతులను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడం మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కోసం గంటలు తరబడి పోలీసులు పడిగాపులు కాస్తూ ఉండడంతో సమయం వృధా అయ్యేదని అలా కాకుండా తమ ప్రభుత్వ హయాంలో ఆ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తే ప్రజలకు న్యాయం చేసేవారు అవుతారని తాను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని కనుక తనకు పోలీసుల సెక్యూరిటీ కూడా అవసరం లేదని ప్రజలకు న్యాయం చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇలా ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్లకే ఎమ్మెల్యే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక, కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నియోజకవర్గంలోని ఐదు కాలేజీల్లో చదువుతున్న సుమారు 1300 మంది విద్యార్థుల ఆకలి తీర్చడం కొరకు నేడు జడ్చర్ల నియోజకవర్గం లోని ఐదు జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో మౌఖిక వసతులకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కళాశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. జడ్చర్ల నియోజకవర్గం విద్య, వైద్య రంగాలలో ముందంజలో ఉంచాలని అన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మన జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎక్కువ శాతం ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయి రంగాల్లో విద్యార్థులు ఉండాలనేదే నా యొక్క ఆకాంక్షాన్ని తెలిపారు. కళాశాల మధ్యాహ్న భోజనం కార్యక్రమం పట్ల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు జడ్చర్ల ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు వారిని బెదిరించి నెల నెల డబ్బులు వసూలు చేసే వారిని అలాగే సి ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా డబ్బులు ఇవ్వాలనుకుంటే పరిశ్రమల యాజమాన్యాలు తనకు ఇవ్వకుండా నేరుగా నియోజకవర్గంలోని విద్య, వైద్యం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు.
ప్రజాపాలన, అభయహస్తం, ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీపీ బోజ్యానాయక్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిదిగుండం, నార్ల పూరు గ్రామాల్లో ప్రజా పరిపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ ఎంపీపీ భోజ్యనాయక్, చర్పంచ్ చిట్టెమ్మ, మాజీ సర్పచులు శారద లోకేశ్, రామన్ గౌడ్, ఎంపీడీఓ చెన్నమ్మ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజలకు వివరించారు. దరఖాస్తులను ప్రజలకు అందజేసి దరఖాస్తులు నింపే విధానాన్ని పంచాయతీ సెక్రెటరీ గోపాల్ వివరించారు. గ్రామపంచాయతీ దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆరు గ్యారెంటీల పథకాలకు కౌంటర్లు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యాన్ని సర్పంచ్, ఎంపీపీ బోజ్యా నాయక్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను దగ్గరుండి నింపి, తప్పులు దొర్లకుండా ఆయన అధికారులు పరివేక్షించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని మిగిలిన వాటిని ప్రజాపాలన ద్వారా వినతులను తీసుకొని అర్హులందరికీ వంద రోజుల్లో అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆరో వార్డు సిలార్ పల్లిలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం అని అన్నారు. అనంతరం కౌన్సిలర్ విజయలక్ష్మి ఆమె కుమారుడు సతీష్ సమకూర్చిన అమ్మ అన్నపూర్ణ కార్డులను పంపిణీ చేసి ఆ కార్డు ద్వారా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. విద్యార్థినీలకు సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచులు బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, చింతల రమణా రెడ్డి, కౌన్సిలర్ ఎజాజ్ శ్రీధర్ రెడ్డి, బాలు నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజాపాలన కార్యక్రమంలో అభయ హస్తం సంక్షేమ పథకాల దరఖాస్తులతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ప్రజా పాలనలో భాగంగా మంగళవారం ఉదయం వనపర్తి మండలంలోనీ నాచహల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను గ్రామస్థాయిలో గుర్తించి అక్కడే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. అభయ హస్తం దరఖాస్తులతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలు లేదా గ్రామ సమస్యలు ఉంటే తెల్ల కాగితం పై రాసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో ఇవ్వాలని ప్రజలను కోరారు. దరఖాస్తు లో రాసిన ప్రతి అక్షరం వారి బాధలు, సమస్యలు ఉంటాయని అందువల్ల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ గ్రామ స్థాయిలో పరిష్కారం కాని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అభయ హస్తం దరఖాస్తులు ఎలా పూరించాలి అనే విషయం చాలా మందికి తెలియదని అందువల్ల గ్రామంలోని చదువుకున్న యువత ఫారాలు నింపడంలో సహకరించాలని కోరారు. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జీరాక్స్ పొందుపరచి ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ కిచ్చారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అన్ని గ్రామాలతో పాటు తండాల్లో తిరిగి ప్రజల సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు నిరుపేద, బడుగు బలహీన అణగారిన ప్రజలకు అందించేందుకు ప్రజా పాలన అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదని, ప్రజా పాలన కార్యక్రమం కింద అధికారులు, ప్రజాప్రతినిధులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ నీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. మిగిలిన హామీలను ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. వృద్ధాప్య పింఛన్లు 2000 నుండి 4000 లకు పెంపు, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కౌలు రైతులకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు. నాచహల్లి గ్రామంలో సి.సి రోడ్లు, డ్రైనేజ్ సిస్టం అస్తవ్యస్తంగా ఉందని వీటిని బాగు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అంతకుముందు జిల్లా యువజన సర్వీసుల శాఖ జిల్లా అధికారి సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్, గ్రామ సర్పంచి మంద శశిరేఖ, ఉప సర్పంచి అబ్దుల్లా, ప్రజలు పాల్గొన్నారు.




Total views : 194324