కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (సీపీఎం), కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేవలం వామపక్షాలతోనే కాకుండా.. ‘ఎల్డీఎఫ్-బీజేపీల’ ఉమ్మడి కూటమితో పోరాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. పతనంతిట్ట జిల్లా అడూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడిలోని బంగారాన్ని వామపక్ష నేతలు కాజేసి, ఆ స్థానంలో ఇత్తడి ఉంచారన్న ఆరోపణలపై ప్రధాని మౌనం వహించడం.. ఎల్డీఎఫ్, బీజేపీల కుమ్మక్కును స్పష్టం చేస్తోందన్నారు. ఓట్లు వస్తాయనుకుంటేనే మోడీకి గుడులు, మతం గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయని, తనపై 36 కేసులు పెట్టి 55 గంటలపాటు విచారించారని రాహుల్ గుర్తుచేశారు. కానీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే వారి ‘అపవిత్ర పొత్తు’కు నిదర్శనమన్నారు. అవినీతి మరకల వల్లే సీఎం విజయన్.. మోడీ గుప్పిట్లో ఉన్నారని ఆరోపించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం తన సైద్ధాంతిక మూలాలను గాలికొదిలేసిందని విమర్శించారు. కేరళలో యూడీఎఫ్‌ను దెబ్బతీయాలని బీజేపీ తెరవెనుక రాజకీయం నడుపుతోందన్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (సీపీఎం), కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు…
127



Total views : 141614