Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News జగిత్యాల జిల్లాలోని ఓ ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది…

జగిత్యాల జిల్లాలోని ఓ ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది…

by CVR NEWS

జగిత్యాల జిల్లాలోని ఓ ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన హాస్టల్ సిబ్బందే వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. హాస్టల్‌లో కామాటిగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి, చదువుకోవడానికి వచ్చిన చిన్నారులను చీపురుతో చితకబాదుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. తాళ్ల ధర్మారం నుండి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన ఈ ప్రబుద్ధుడు.. గత నాలుగు నెలలుగా రోజూ మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తాగి వచ్చి విధులకు హాజరవడమే కాకుండా..ఏ కారణం లేకుండా తమను చీపురుతో కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను చదువుకోవడానికి హాస్టల్‌కు పంపిస్తే, అక్కడ వారిని చిత్రహింసలకు గురిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాలుగు నెలలుగా ఇలాంటి దారుణం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీస్తున్నారు. వెంటనే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే హాస్టల్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుమార్లు సదరు వ్యక్తిని మందలించినప్పటికీ, అతని తీరులో మార్పు రాలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే శ్రీనివాస్ ఇంత కాలం తన ఆగడాలను సాగించగలిగాడని హాస్టల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మరోవైపు ఈ ఘటనపై ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన అధికారులు, శ్రీనివాస్‌పై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే అతడిని విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పసిపిల్లలపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: