ఎండలు మండుతున్నా.. రాజకీయాలు వేడెక్కుతున్నా.. బెంగాల్ ఓటరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణక్షేత్రంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం, సాయంత్రం వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం, సాయంత్రం 5 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా సగటున 89% ఓటింగ్ నమోదైంది. ఇక పోలింగ్ ముగిసే సమయానికి 92 శాతం దాటొచ్చనే టాక్ వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకే 90 శాతానికి పైగా ఓటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే ఈసారి కూడా మహిళా ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా కనిపిస్తున్నారు. పొడవైన క్యూ లైన్లలో మహిళలు పెద్ద ఎత్తున వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా కొన్ని హింసాత్మక ఘటనలు మినహా, పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగా సాగింది. కేంద్ర బలగాల పహారాలో ఓటర్లు నిర్భయంగా ఓటు వేశారు.
సాధారణంగా బెంగాల్‌లో పోలింగ్ శాతం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది, కానీ 5 గంటలకే 89 శాతం మార్కును తాకడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ భారీ ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్‌లో జరుగుతోంది.
ఇక తమిళనాడులోనూ పోలింగ్ రికార్డ్ స్థాయిలో నమోదైంది. తమిళనాడు అంటేనే సినిమాకు ఓ రేంజ్ క్రేజ్.. రాజకీయం అంటే ఒక ఎమోషన్.. ఆ ఎమోషన్‌ను తమిళ తంబీలు ఇవాళ తమ ఓటుతో వ్యక్తపరిచారు. సాయంత్రం 5 గంటలకే 82 శాతం పైగా పోలింగ్ అంటే.. ఇది ఓటర్ల తీర్పు కాదు, రాజకీయ పార్టీలకు ఒక భారీ వార్నింగ్ బెల్ అని చెప్తున్నారు. వాస్తవానికి ఎండాకాలం కావడంతో.. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటర్లు ఉదయం సమయమే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ బూతుల దగ్గర ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరటం కనిపించింది. పోలింగ్ పూర్తిగా ముగిసే సమయానికి 90 శాతం దాటొచ్చనే అంచనాలున్నాయి. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 76.6 శాతం ఓట్లు నమోదయ్యాయి.
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట ట్రయాంగిల్ వార్ జరుగుతోంది.



Total views : 141614