ఈ ఏడాది పద్మ అవార్డ్స్ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురష్కారాలను ప్రదానం చేశారు. మొదటి విడతలో దివంగత నటుడు ధర్మేంద్ర, ఎన్.రాజంలకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ ప్రధానం చేయగా.. ఇప్పుడు ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ లకు పద్మవిభూషణ్ అందజేశారు.
మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టికి ‘పద్మ భూషణ్’ అవార్డును ప్రధానం చేశారు. అలానే ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్‌తో పాటు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. రెండో విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి సినీ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. వీరితో పాటు సినీ హీరో ఆర్. మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను ప్రధానం చేశారు.