ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే అంబటి రాంబాబు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ స్పందించారు. 15 రోజుల క్రితం గుండెకు స్టంట్‌లు వేయించుకున్నానని, డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ముందుగా సమాచారం ఇచ్చి విచారణకు వస్తానని, తప్పనిసరిగా సహకరిస్తానని మెసేజ్ పంపారు. ఆయన సమాధానంపై ఈడీ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదే కేసులో ఇప్పటికే మర్రి సుబ్బారెడ్డి, పురుషోత్తమరావుల వాంగ్మూలాలను ఈడీ నమోదు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు లిక్కర్ రవాణా కోసం సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు గుర్తించారు. మొదటి కాంట్రాక్టు కాలంలో వీరిద్దరూ కలిసి సుమారు 59.14 లక్షల మద్యం పెట్టెలు రవాణా చేశారని అధికారులు ప్రశ్నించారు. సిగ్మా సంస్థ నుంచి 15కోట్ల 44 లక్షలు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సబ్‌కాంట్రాక్టులు, నిధుల మళ్లింపు, అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపై కూడా వివరాలు అడిగారు. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను అధికంగా పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఈడీ లెక్కలు చూపిస్తోంది.
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
39