వైఎస్ జగన్పై రాష్ట్ర మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో బాధితుడి కుటుంబాన్ని విస్మరించి, నిందితుడి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఇది పరామర్శ కాదని, నేరపూరిత మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని… అయితే జగన్ మాత్రం బాధితులను వదిలి నిందితుల పక్షాన నిలిచారని లోకేష్ విమర్శించారు.
శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్, హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసేందుకు వెళ్లారు. అయితే, ఆయన సాయంత్రం 5 గంటల తర్వాత చేరుకోవడంతో జైలు అధికారులు అనుమతించలేదు. జగన్ చర్యలపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారు. కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక నిండు ప్రాణం బలైన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనమన్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి, నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇది పరామర్శ కాదు, నేర మనస్తత్వానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు మంత్రి నారా లోకేశ్.