Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home International వెనెజులాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన జంట భూకంపాలు.

వెనెజులాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన జంట భూకంపాలు.

by CVR NEWS
వెనెజులాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన జంట భూకంపాలు

రెండు భారీ భూకంపాలు వెనెజులా దేశాన్ని వణికించాయి. కేవలం 40 సెకన్ల వ్యవధిలో సంభవించిన ప్రకృతి విపత్తులు భారీ వినాశనాన్ని సృష్టించాయి. ఈ జంట భూకంపాల ధాటికి 164 మంది మరణించగా, 971 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. వందలాది భవనాలు నేల కూలగా.. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. అన్ని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

వెనెజులా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలిసారి భూమి కంపించింది. కరీబియన్‌ తీరంలోని మోరన్ ప్రాంతంలో 7.2 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. ఆ తర్వాత కేవలం 40 సెకన్లలో 7.5 తీవ్రతతో మరో అతి భారీ భూకంపం సంభవించింది. 1900 సంవత్సరం తర్వాత వెనెజులాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. ఈ జంట భూకంపాల తర్వాత దాదాపు 20 కి పైగా ప్రకంపనలు వచ్చాయి. నిమిషం వ్యవధిలో అల్లకల్లోకం కావడంతో ప్రజలకు ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి. భవనాల్లో ఉన్నవారు బయటకు వచ్చే లోపే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. రాజధాని కారకాస్, తీరప్రాంత రాష్ట్రమైన లా గువైరాలో 100కు పైగా బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, నివాస గృహాలు కుప్పకూలిపోయాయి. కారకాస్‌లోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పులు కూలిపోవడంతో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. మెట్రో సేవలు నిలిచిపోయాయి పలు నగరాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి.

అయితే గూగుల్‌ సాంకేతికత చాలా వరకు వెనెజులా వాసులను కాపాడిందని చెప్పవచ్చు. వినాశకరమైన రెండో భూకంపం రాబోయే కొన్ని సెకన్ల ముందే ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘గూగుల్ ఎర్త్‌క్వేక్ అలర్ట్’ వచ్చింది. దీంతో అప్రమత్తమైన లక్షలాది మంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోగలిగారు. భారీ భవనాల్లో ఉన్నవారికి మాత్రం ఆ అవకాశం లేకపోవడంతో శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఊహకు అందని విధ్వంసం జరగడంతో… అధికార యంత్రాంగానికి కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. శిథిలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్న కొద్దీ.. క్షతగాత్రులు బయటకు వస్తున్నారు. మృతదేహాలను వెలికితీయడం అతిపెద్ద సమస్యగా మారింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన వెనెజులా ప్రభుత్వం.. అంతర్జాతీయ సాయం కోరారు. ఐక్యరాజ్య సమితి సమన్వయంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు మొదలుపెట్టాయి. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని, వైద్య సహాయాన్ని అత్యవసరంగా తరలిస్తున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: