Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారుల విన్యాసాలు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారుల విన్యాసాలు.

by CVR NEWS
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారుల విన్యాసాలు

సాహసానికి నిలువెత్తు రూపాలు ఆ చిన్నారులు… గుండె నిండా ధైర్యం… ఒళ్లంతా పట్టుదల… ఉంటే వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కల్యాణ్ తన శరీరంపై నుంచి కార్లు, బైకులను పోనిస్తూ చేసిన సాహసాలు గుర్తున్నాయి కదా… సరిగ్గా అలాంటి స్టంట్లతో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కసారిగా మార్మోగిపోయింది. వంద కార్లు… వంద బైకులు… శరీరంపై నుంచి వెళ్తుంటే… చూసేవారి గుండె ఆగిపోయినంత పనైంతుంటే… ఆ ఇద్దరు చిచ్చర పిడుగులు మాత్రం నవ్వుతూ రికార్డులు కొడుతున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కృష్ణాపురం ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది. స్థానిక అయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాహస ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచాయి. అకాడమీకి చెందిన చిన్నారులైన అన్నదమ్ములు లక్కీ, విక్కీలు తమ అసాధారణ ప్రతిభతో తాడిపత్రి సత్తాను ప్రపంచానికి చాటారు. చిన్న వయసులోనే వారు ప్రదర్శించిన గుండె నిబ్బరం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. లక్కీ 100 కార్లను, విక్కీ 100 బైకులను తమ శరీరంపై పోనిచ్చుకుని రికార్డు సృష్టించడం తమకు ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. గతంలో 100 బల్బులు, 100 పెంకలు పగలగొట్టే సాహసాలు సైతం చేశారన్నారు. ఇలాంటి కఠినమైన సాహసాలు చేయాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు పిల్లల్లో అమితమైన ధైర్యం, కఠోర సాధన చాలా అవసరమని… తమ పిల్లలకు శిక్షణ ఇచ్చిన కోచ్ సాయిబాబా మాస్టర్‌కి వారు కృతజ్ఞతలు తెలిపారు.

లక్కీ, విక్కీలు ఇద్దరూ అసాధారణమైన ప్రతిభ గల పిడుగులు. ఇప్పటికే వీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబుల్ వరల్డ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక రికార్డులను కైవసం చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ ఇద్దరు చిన్నారులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో సైతం స్థానం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ శివ గంగధర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి ఆనంద్, తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ శివయ్య మాస్టర్, కోచ్ సాయిబాబా మాస్టర్ హాజరై చిన్నారులను అభినందించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి తాడిపత్రి పట్టణ ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: