పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వేపచెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. గ్రామస్తులు తమ తాతలు, ముత్తాతల కాలం నుంచే ఈ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.ప్రతి ఐదేళ్లకోసారి ఈ వేపచెట్టు వద్ద భారీ జాతర మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చెట్టు మధ్య భాగంలో కలువపువ్వు ఆకారాన్ని పోలిన నిర్మాణం ఉండటంతో దీనిని దైవచిహ్నంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బ్రహ్మంగారు చెప్పిన సంకేతాలకు అనుగుణంగా ఈ చెట్టుకు కలువపువ్వు పూసిందని స్థానికులు చెబుతున్నారు.
అయితే గత రాత్రి వీచిన స్వల్ప ఈదురుగాలుల కారణంగా ఈ పురాతన వేపచెట్టు నేలవాలింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో రహదారి విస్తరణ పనుల సమయంలో చెట్టును తొలగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ, చెట్టును తాకిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చాయని నమ్ముతున్న గ్రామస్తులు, దానిని యథాతథంగా ఉంచాలని అధికారులను కోరిన విషయం గుర్తుచేస్తున్నారు.ఇప్పుడు చెట్టు విరిగిపోవడంతో గ్రామానికి ఏదైనా అరిష్టం సంభవిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి గ్రామస్థుల విశ్వాసాలు మాత్రమేనని, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.
Latest News
నంద్యాల, కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి నంద్యాల వైపు వస్తున్న కారు తమ్మరాజుపల్లె సమీపానికి చేరుకోగానే టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సురేష్ రెడ్డి గతంలో నంద్యాల, పాణ్యం పోలీస్ స్టేషన్లో కూడా విధులు నిర్వహించారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఎస్బీ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పాణ్యం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టైరు పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో నంద్యాల–కర్నూలు జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం ప్రయాణికులు, వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరణించిన వ్యక్తుల పేర్లపై కూడా కొందరు పెన్షన్ నగదును డ్రా చేస్తున్నట్లు నిఘా వర్గాలు, క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
సాంకేతికత ఆధారంగా చేపట్టిన లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా ఈ అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. చనిపోయినవారు, అర్హత లేని వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అనర్హుల తొలగింపుతో మిగిలే నిధులను నిజమైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మంది అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా గుర్తించిన లక్ష మంది అనర్హుల స్థానంలో మరో లక్ష మంది అర్హులకు త్వరలో పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొత్తం దాదాపు మూడు లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్ సౌకర్యం అందనున్నట్లు తెలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట కలిగించనుంది. త్వరలోనే అర్హుల తుది జాబితాను విడుదల చేసి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఆ పెద్ద రోజున దీనికంటే మరింత క్లినికల్ ప్రదర్శన ఉండడం కష్టం. మ్యాచ్‌కు ముందు ఎంత హైప్, ఎంత ఉత్కంఠ నెలకొన్నా, ఈ టోర్నమెంట్‌పై ఎన్నో సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న జట్టుకు ఇంగ్లండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 10 ఎడిషన్లలో 7 టైటిళ్లు గెలిచిందంటే వారి ఆధిపత్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది.
ఆస్ట్రేలియా గ్రూప్ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా ముగించింది. ఆ ప్రయాణంలో భారత్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఓడించింది. అనంతరం సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను సులభంగా అధిగమించి, ఇప్పుడు ఫైనల్లోనూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
వేరియబుల్ బౌన్స్ ఉన్న పిచ్‌పై 151 పరుగుల లక్ష్యం పోరాడదగినదిగానే కనిపించింది. కానీ బెత్ మూనీ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫీబీ లిచ్‌ఫీల్డ్‌తో కలిసి ఆమె పవర్‌ప్లేలోనే ఛేజ్కు బలమైన పునాది వేసింది. ఇద్దరూ అవసరమైన రన్‌రేట్‌ను అధిగమించి, ఇంగ్లండ్‌కు ఏ దశలోనూ మ్యాచ్‌లో తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద వేదికపై ఎలాంటి ఉత్కంఠకు తావులేకుండా ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది.
విశాఖ తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఉదంతంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌లతో ఆమె ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి, జిల్లా కలెక్టర్, డీఐజీ, సీపీ, మరియు మత్స్యశాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. నేవీ హెలికాప్టర్లు, మెరైన్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను హోం మంత్రి ఆదేశించారు.
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల ఒకటో తేదీన విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులైన అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్యల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.మత్స్యకారుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, మత్స్యకారుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ, మెరైన్ పోలీసులు, కోస్ట్‌గార్డ్ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి.గల్లంతైన వారిలో ఆరుగురు భోగాపురం ముక్కాంకు చెందినవారు కాగా, మరొకరు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పామర్రు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని చూసి ప్రతిపక్ష నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఆర్అండ్బీ రోడ్లు, డ్రైనేజీలు, ఎంఎస్ఎంఈ పార్క్‌తో పాటు పలు అభివృద్ధి పనులు పామర్రు నియోజకవర్గంలో జరిగాయని తెలిపారు. చెరువుల మట్టి తవ్వకాలపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు చేపట్టామని స్పష్టం చేశారు. గ్రామాల్లో స్మశానాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాల అభివృద్ధికి మట్టి వినియోగించామని వెల్లడించారు.తన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని మండిపడిన కుమార్ రాజా.. రాజకీయంగా విమర్శలు చేయాలంటే తనను లక్ష్యంగా చేసుకోవాలని, కుటుంబ వ్యవహారాల్లోకి రావొద్దని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను హెచ్చరించారు.
జగన్ వ్యాఖ్యల్లో స్థిరత్వం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మావిగన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె… స్థిరత్వం లేని వ్యక్తిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఉత్తరాంధ్రలో జగన్ కంటే సీనియర్ నాయకులు ఉన్నారని.. ఆయన నిలకడలేని రాజకీయ వైఖరితో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇక ఫలించవన్నారు సంధ్యారాణి.
దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేటకు ఏపీ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో కొరియా మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించనున్న లోకేష్.. ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో పాటు స్టార్టప్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొననున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
స్వర్ణకుప్పం విజన్–2029 రూపకల్పనపై సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని తన క్యాంప్ కార్యాలయంలో సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్వర్ణకుప్పం విజన్–2029 కోసం రూపొందించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను సుర్బానా జురాంగ్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.వ్యవసాయం, పర్యాటక రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన కొత్త కార్యక్రమాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కుప్పం భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, ఉద్యానవన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద, ప్రజల జీవన విధానం, ఆదాయ వనరుల గురించి సీఎం వివరించారు.
కుప్పం అభివృద్ధికి అన్ని రంగాలను కలుపుకొని సమగ్ర విజన్ ప్లాన్ రూపొందించాలని సూచించిన సీఎం, కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలను ప్రతిపాదించాలని కోరారు.యువత మరియు స్థానిక ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, అందుబాటులో ఉన్న వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని SJ, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు సూచించారు.
కుప్పానికి ఉన్న సహజ, భౌగోళిక, ఆర్థిక అనుకూలతలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని, ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన జీవనానికి అనువైన ప్రాంతంగా కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ప్రాజెక్టులను రూపొందించాలని సీఎం సూచించారు.అలాగే, కుప్పంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాంతాన్ని తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని SJ, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.




Total views : 194859