Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Latest News కావేరి వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డీఎంకే డిమాండ్.

కావేరి వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డీఎంకే డిమాండ్.

by CVR NEWS

కావేరి జలాల పంపకం, కర్ణాటక ప్రతిపాదిత మేకేదాటు డ్యామ్ నిర్మాణం అంశాలపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. DMK నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలకు సీఎం విజయ్ ఘాటుగా బదులిచ్చారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్ని అవమానాలనైనా భరిస్తానని సీఎం కామెంట్స్ చేయడంతో సభలో చర్చనీయాంశమైంది.

కావేరి జల వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. డెల్టా రైతులు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కర్ణాటక మొండివైఖరిని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. మేకేదాటు ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించాలని, ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

అయితే దీనిపై స్పందించిన సీఎం విజయ్.. కావేరి సమస్యపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. మేకేదాటు ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేసిన నేపథ్యంలో మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కర్ణాటక ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరపాలన్న నిర్ణయాన్ని సీఎం విజయ్ సమర్థించుకున్నారు. శత్రు దేశాలు సైతం సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నప్పుడు, పొరుగు రాష్ట్రంతో చర్చలు నిర్వహించడంలో తప్పేముందని ప్రశ్నించారు. చర్చల కోసం బెంగళూరుకు వెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. 1969లో మేకేదాటు ప్రాజెక్ట్‌కు తొలి అనుమతులు డీఎంకే ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారని పేర్కొంటూ ఉదయనిధి స్టాలిన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

కావేరి జలాల వివాదం, మేకేదాటు ప్రాజెక్ట్ అంశాలు మరోసారి తమిళనాడు రాజకీయాల్లో వేడిని రాజేశాయి. ప్రతిపక్షం అఖిలపక్ష సమావేశం కోసం ఒత్తిడి కొనసాగిస్తుండగా, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో రాజీ లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: