ఝార్ఖండ్‌లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.విద్యార్థుల ర్యాలీలో పాల్గొనేందుకు ఝార్ఖండ్‌లోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రాజధాని రాంచీకి చేరుకున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగినప్పటికీ.. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. గతంలో ప్రకటించినట్టుగానే అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు.
పేపర్ లీక్ వ్యవహారంపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రభుత్వ చర్యలపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని.. పేపర్ లీక్ వ్యవహారంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.మరోవైపు విద్యార్థులు భారీ సంఖ్యలో రాంచీకి తరలిరావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
రాంచీకి వచ్చే మార్గాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాల సరిహద్దులతో పాటు రాష్ట్ర రహదారులపై కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాజధానికి చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు రాంచీలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఒకవైపు తమ డిమాండ్ల సాధన కోసం వేలాది మంది విద్యార్థులు అసెంబ్లీ వైపు ర్యాలీగా కదులుతుండగా.. మరోవైపు వారిని నియంత్రించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో రాంచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.