Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News రూపురేఖలు మారిన సికింద్రాబాద్..

రూపురేఖలు మారిన సికింద్రాబాద్..

by CVR NEWS

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఒకప్పుడు రద్దీ, గజిబిజి.. కానీ ఇకపై అది గతం! ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లా మెరిసిపోతోంది. దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 719 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో స్టేషన్ రూపురేఖలనే మార్చేశారు అధికారులు. అడుగు పెడితే రైల్వే స్టేషనా లేక విమానాశ్రయమా అనే భ్రమ కలిగేలా అధునాతన హంగులు అద్దారు. ఈ అద్భుత కట్టడాన్ని జాతికి అంకితం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ ఫేజ్-1 పనులను ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి.

తొలి దశలో భాగంగా ప్లాట్‌ఫామ్-10 వైపు పనులు పూర్తి కావచ్చాయి. నాలుగు అంతస్తులతో, 22,516 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐకానిక్ స్టేషన్ భవనం సిద్ధమైంది. దక్షిణం వైపు మరో 14,972 చదరపు మీటర్ల భవనం కూడా రెడీ అయ్యింది. ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో నేరుగా ఒకటో అంతస్తులోకి వెళ్లే సదుపాయం, అక్కడ వెయింటింగ్ హాళ్లు, షాపింగ్ మాల్స్ ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌లోకి రావడానికి, తిరిగి వెళ్లడానికి ప్రత్యేకంగా స్కైవాక్‌లను ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫామ్‌ల పైభాగంలో వెయింటింగ్ ఏరియాలు, కింద రైళ్లు వెళ్లేలా డిజైన్ చేసిన ఈ స్టేషన్.. గతం కంటే పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా ప్లాట్‌ఫామ్-10 వైపు పనులు పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

స్టేషన్ అభివృద్ధి పనుల వల్ల ఇప్పటివరకు పలు రైళ్లను చర్లపల్లికి మళ్లించారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, పనులు పూర్తి కావస్తుండటంతో త్వరలోనే రైళ్లన్నీ తిరిగి సికింద్రాబాద్ నుంచే నడవనున్నాయి. రెండో దశ పనులను కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేలా రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి, ఆధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విశ్వనగరానికి మరో మణిహారంగా మారబోతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: