సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా తాజా పర్యటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు సాగనున్న టూర్లో భాగంగా నేడు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ, మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన కేంద్ర నిధులు, అనుమతులపై సంబంధిత కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, ప్యాకేజీలతో పాటు పండిన పంటలకు మద్దతు ధర, ఎరువుల సరఫరా వంటి అంశాలపై మంత్రులతో భేటీ కానున్నారు. చివరగా ఆయన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయి రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
Telangana
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బోనాల ఉత్సవాలకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, హిందూ పండుగలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే రాబోయే గణేష్ ఉత్సవాలతో పాటు అన్ని హిందూ పండుగలకు తగిన నిధులు విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బీదర్ జిల్లాకు చెందిన రాజేశ్వరి… తన తొమ్మిది నెలల కుమార్తె అనురాధను బైరామల్‌గూడ చెరువులో ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఘటన సమయంలో రాజేశ్వరి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన, నాణ్యమైన వైద్యా సేవలు అందించేలా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, ప్యాకేజీ రేట్ల సమీక్షపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై విస్తృత చర్చ జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్, సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య సహాయం ఎప్పుడు వచ్చినా వెంటనే అందేలా 24 గంటల ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. నెట్వర్క్ ఆసుపత్రులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఆరోగ్య పథకంలో మెరుగైన మార్పులు తెస్తోందని, దీని ద్వారా వేలాది మంది ఉద్యోగ, పెన్షనర్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు.
పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన, అనుకూలమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, పార్టీలు మారవచ్చు కానీ, గత ప్రభుత్వాలు చేపట్టిన మంచి పనులను మేం కొనసాగిస్తాయని సీఎం స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను హైదరాబాద్‌కు రప్పించి పెట్టుబడులను ఆకర్షించిన తీరును ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు సాకారమయ్యాయన్నారు. తద్వారా ఫార్మా ఐటీ రంగాలు మరింత విస్తరించాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, తయారీ రంగంలో చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నగరాల పరంగా టోక్యో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్నామని ఆయన అన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో మూడు తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సుమారు 200 కంపెనీలు ముందుకు వచ్చాయని సీఎం తెలిపారు. డేటా సెంటర్ల స్థాపన కోసం అమెజాన్ సంస్థ 1 లక్ష కోట్లు, అదానీ గ్రూప్ రూ.35,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను తీసుకురావడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇంతవరకు జరిగిన పరీక్షలు, ఫలితాలు, చేపట్టాల్సిన పనులపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ నేడు దిల్లీలో సమావేశం కానుంది. చేయాల్సిన పనులపై రోడ్‌మ్యాప్ సహా ఆరు అంశాలపై కమిటీ చర్చించనుంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ సిఫార్సు మేరకు పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ చేసిన పరీక్షలు, వచ్చిన ఫలితాలపై కమిటీ చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్డీఎస్ఏలోని మెంబర్ టెక్నికల్ ఛైర్మన్‌గా జూన్ 30న ఏర్పాటైన ఈ కమిటీలో నీటిపారుదలశాఖ సంయుక్త కార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్, సీడబ్ల్యూసీలోని గేట్ల విభాగం డైరెక్టర్, దిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త షాహిద్ నూర్, సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తలు హనుమంతప్ప, పి.ఎస్.కుంజీర్, నీటిపారుదలశాఖ హైడ్రాలజీ విభాగం ఎస్ఈ సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి తీసుకున్న చర్యలపై నీటిపారుదలశాఖ మొదట ప్రజంటేషన్ ఇస్తుంది. ఇందులో చేసిన పరీక్షలు, ఫలితాలు, జియో టెక్నికల్, జియో ఫిజికల్, స్ట్రక్చరల్ ఇన్వెస్టిగేషన్స్, వీటి ఫలితాలతోపాటు సీకెంట్ పైల్స్ గురించి చర్చిస్తారు. ప్రతిపాదించి చేయని క్రాస్‌హోల్ సెస్మిక్ టెస్టింగ్‌పై కూడా సాంకేతికంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీ పాత్ర, రోడ్‌మ్యాప్ గురించి చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం కూడా ఉంది.
సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా రాహుల్ గాంధీ మొదటి నుంచే డిమాండ్ చేశారని గుర్తు చేశారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం స్వతంత్ర సంస్థలుగా కాకుండా జేబు సంస్థలుగా మార్చుకుని, వాటిని విపక్షాలపై రాజకీయంగా ఉపయోగిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా పనిచేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
యువత పోరాటం, నిరంతర ఒత్తిడి కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించాల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీనామాతో మాత్రమే ఈ వ్యవహారం ముగిసిపోదని, నీట్ పరీక్షల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. దేశ యువత న్యాయం కోసం చేసిన పోరాటానికి ఇది తొలి విజయమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.
అదానీ, అంబానీలు, కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ రెడ్ కార్పెట్ పర్చుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొమురవెల్లి రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణాన్ని వేడెక్కించింది. రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే అక్కడకు భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు తమ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయ నినాదాలు చేయవద్దంటూ అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు తమపై భౌతిక దాడికి దిగారని, చేయి చేసుకున్నారని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఆరోపించారు. కొద్దిసేపు తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు అదనపు బలగాలతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
సరిహద్దు గ్రామాల అభివృద్ధే దేశ భద్రతకు, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్–2026లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని.. సరిహద్దు గ్రామాలను దేశంలోని చివరి గ్రామాలుగా కాకుండా మొదటి గ్రామాలుగా తమ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దేశంలో తొలి సూర్యకిరణం పడేది, చివరి కిరణం వీడ్కోలు చెప్పేది ఈ గ్రామాలకేనని, త్రివర్ణ పతాకం గాలితో తొలిసారి సంభాషించేది కూడా ఈ ప్రాంతాల్లోనేనని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత తొలిసారిగా విద్యుత్, రహదారులు, తాగునీరు, గ్యాస్ కనెక్షన్లు వంటి మౌలిక సదుపాయాలు ఈ గ్రామాలకు చేరాయని చెప్పారు. మెరుగైన రవాణా, ఇంటర్నెట్ సౌకర్యాలతో రైతులు, ఉద్యానవన రైతుల ఉత్పత్తులు సులభంగా మార్కెట్లకు చేరుతున్నాయని అన్నారు.సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఒకప్పుడు వెలవెలబోయిన గ్రామాలు ఇప్పుడు మళ్లీ ప్రజల రాకపోకలతో కళకళలాడుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ రూపకల్పన నుంచి టెండర్ల వరకు అన్ని అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.ధరణి పోర్టల్‌కు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది.మాజీ డీజీపీ చారుసిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ధరణి పోర్టల్ టెండర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది.వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా, టెండర్ నిబంధనలు సక్రమంగా పాటించారా అనే అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీయనుంది.అలాగే డేటా భద్రత, గోప్యత ఉల్లంఘనలు, పోర్టల్ రూపకల్పనలోని లోపాలు, అనధికార లావాదేవీలు, ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై కూడా విచారణ చేపట్టనుంది.ధరణి పోర్టల్ నిర్వహణలో విదేశీ సంస్థల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ స్పెషల్ ఎంక్వైరీ టీమ్ దర్యాప్తు చేయనుంది.విచారణ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్న ఈ బృందం, అవసరమైతే మధ్యంతర నివేదికను కూడా అందించనుంది.