తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని సంతరించుకుంది.ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం ఆయన వేణుగోపాల్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులు, వారు సమర్పించిన వివరణలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధిష్ఠానం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై అధిష్టానానికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చేసుకుని సీఎం రేవంత్ పూర్తి వివరాలు అందించినట్లుగా సమాచారం. మరోవైపు పార్టీ సీనియర్ నేత, ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా ఈ భేటీలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీని కలిసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా విశ్వప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ఇచ్చిన మాట మేరకు తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టాన పెద్దలను కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది.