Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.

సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.

by CVR NEWS

ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్‌ 2న శ్రీకారం చుట్టనున్నారు. దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమైన ఎడమ కాలువ కలను క్షేత్రస్థాయిలోకి తెస్తూ, యుద్ధప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించి గోదావరి పరవళ్లను ఉత్తరాంధ్ర సరిహద్దులకు చేర్చడం రాష్ట్ర జలవనరుల రంగంలో అత్యంత కీలక మైలురాయిగా నిలుస్తోంది.

పోలవరం ఎడమ కాలువను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అధికార యంత్రాంగం, జలవనరుల శాఖ తీవ్రస్థాయిలో శ్రమించాయి. గతంలో భూసేకరణ సమస్యలు, ప్యాకేజీల వివాదాలు, కాలువ లైనింగ్ , క్రాస్ డ్రైనేజ్ పనుల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేసింది. నిలిచిపోయిన స్ట్రక్చర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ, గ్యాప్‌లను పూడ్చి నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది పగలు రాత్రి శ్రమించి కాలువను జల ప్రవాహానికి సిద్ధం చేశారు.

సెప్టెంబర్‌ 2న చంద్రబాబు నీరు విడుదల చేయనున్నారు. ఈ నీటి రాకతో ఉత్తరాంధ్రలోని పాయకరావుపేట నియోజకవర్గంతో పాటు అనకాపల్లి, విశాఖ జిల్లాల పరిధిలోని సుమారు వేలాది ఎకరాల ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భద్రత లభించనుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి నీటి లభ్యత తగ్గడంతో తరచూ ఎండిపోయే తాండవ, వరాహ, శారదా నదీ పరీవాహక ప్రాంతాలు గోదావరి జలాలతో రీఛార్జ్ కానున్నాయి. ఫలితంగా ఆయా నదుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు నిండి భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాలు సరిగా కురవని సమయాల్లో కూడా గోదావరి వరద జలాలను సమర్థవంతంగా ఒడిసిపట్టి ఎడమ కాలువ ద్వారా తరలించడం రైతులకు కొండంత అండగా నిలుస్తోంది. పంటలు ఎండిపోయే దశలో నికర జలాలు అందడం వల్ల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు పంట నష్టాల భయం తప్పుతుంది. ముఖ్యంగా వరి, చెరకు, వాణిజ్య పంటలు సాగు చేసే వేలాది మంది రైతు కుటుంబాల్లో ఈ నీటి ప్రవాహం సరికొత్త ఆర్థిక భరోసాను, ఉత్సాహాన్ని నింపుతోంది. కేవలం వ్యవసాయానికే కాకుండా, విశాఖ మహానగరంతో పాటు పరిసర పారిశ్రామిక హబ్‌లకు అవసరమైన తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చడంలోనూ పోలవరం ఎడమ కాలువ కీలక పాత్ర పోషించనుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: