రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా 240 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పండుగ రద్దీ, ప్రత్యేక బస్సుల నిర్వహణ, తిరుగు ప్రయాణాల ఏర్పాట్లపై మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో వెంటనే అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ముఖ్యంగా తిరుగు ప్రయాణాల సమయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రధాన బస్‌స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ప్రయాణికులకు మంచినీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.