Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh ఉండి మండలంలో పంట కాలువలు కాలుష్య మయం …

ఉండి మండలంలో పంట కాలువలు కాలుష్య మయం …

by CVR NEWS

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండల పరిధిలోని ప్రధాన పంట కాలువలు ఇప్పుడు ప్రజలకు వరంగా కాకుండా భారంగా మారుతున్నాయి. చిలకుపాడు లాకులు నుంచి చెరుకువాడ బైల్ డ్యామ్ వరకూ విస్తరించిన ఈ కాలువలు ఎన్నో గ్రామాల జీవనాధారంగా ఉన్నాయి. అయితే, కాలక్రమేణా ఇవి కాలుష్యపు కేంద్రమాలుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇళ్లలోని మరుగు దొడ్ల వ్యర్థాలను పైపుల ద్వారా నేరుగా కాలువల్లోకి వదలడం, ప్లాస్టిక్, ధర్మాకోల్ వంటి చెత్తను పారవేయడం వల్ల నీటి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది. గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని కొంతవరకు శుభ్రపరిచినా, మళ్లీ అదే పరిస్థితి నెలకొనడం బాధాకరం. ముఖ్యంగా ఈ నీటినే చెరువుల్లో నింపుకుని తాగునీటిగా, సాగునీటిగా వినియోగించడం వల్ల గ్రామాల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డెల్టా ప్రాంతాలకు కీలకమైన ఉండి సబ్‌డివిజన్ పరిధిలో కాలువలు కలుషిత కాసారాలుగా మారిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. కాలువల వెంబడి ఉన్న ఇళ్ల నుంచి వస్తున్న చెత్త, పశువుల కళేబరాలు కూడా నీటిలో పడేయడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చుతోంది. ఇదే కాలుష్య నీటిని చెరువుల్లోకి నింపడం వల్ల ప్రజలు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాలువలను శుభ్రపరచి, చెత్తను పూర్తిగా తొలగించిన తర్వాతే చెరువుల్లోకి నీటిని నింపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: