కాకినాడ జిల్లా తుని చిన్నారి ఎక్కడ అసలు ఆ బాలిక ఏమైంది అన్న అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 9 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలవుతున్నాయి.. అయినా అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాను జాడ దొరకలేదు.
ఈ నెల 6న సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి అదృశ్యం కాగా 9 రోజులుగా పోలీసు బృందాలు..అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అదృశ్యమైన సమయంలో చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చి మృతి చెందిన పెంపుడు కుక్కకు నిన్న పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం పెంపుడు కుక్క శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించి విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షల అనంతరం పెంపుడు కుక్క మరణానికి కారణాలపై స్పష్టత రానుంది.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాలతో అదనంగా 30 మంది NDRF, హనుమాన్ బృందం రంగంలోకి దిగి తోట, కొండ ప్రాంతాన్ని అణువణువు గాలించారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించారు. కొండపై అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు చేరుకుని పరిశీలించారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఫోన్స్ కాల్స్, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా చిన్నారి కోసం గాలిస్తున్నారు. 7 టవర్ల పరిధిలో సుమారు 4,800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వారిలో కొందరు అనుమానితులను గుర్తించి విచారించినట్టు తెలుస్తోంది. ఐనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు చిన్నారి కోసం ఆందోళన చెందుతున్నారు.