Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Telangana కేంద్రంపై ఉమ్మడి పోరుకు తెలంగాణ సై.

కేంద్రంపై ఉమ్మడి పోరుకు తెలంగాణ సై.

by CVR NEWS
కేంద్రంపై ఉమ్మడి పోరుకు తెలంగాణ సై

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం-2025పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల రాష్ట్రాలపై పడే ఆర్థిక భారం, గ్రామీణ ఉపాధి హామీ పథకం భవిష్యత్తుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డా.వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి, రాష్ట్రాల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర నిర్ణయాన్ని న్యాయపరంగా, రాజ్యాంగపరంగా సవాల్ చేయాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని సబ్ కమిటీ అభిప్రాయప్రడింది. దీనివల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు, వ్యవసాయ కార్మికుల జీవన భద్రత తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సముచితం కాదని కమిటీ స్పష్టం చేసింది. గ్రామీణ పేదలకు ఉపాధి హక్కును కల్పించిన ఈ చారిత్రాత్మక పథకానికి గాంధీజీ పేరును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేసింది.

సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను సంప్రదించకుండానే 40 శాతం నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపడాన్ని కమిటీ తప్పుబట్టింది. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్న ప్రతి రూపాయికి తిరిగి వస్తున్నది కేవలం 40 పైసలే అని…అలాంటప్పుడు వీబీజీ రామ్‌జీ పేరుతో అదనంగా మరో 40 శాతం భారం మోపడం ఏ రకంగా న్యాయమని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 258(3) ప్రకారం కేంద్రం అదనపు భారం మోపితే, ఆ నష్టాన్ని కేంద్రమే భరించాలని సభ్యులు గుర్తుచేశారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని మంత్రులు పేర్కొన్నారు.

ఈ చట్టానికి వ్యతిరేకంగా విడివిడిగా కాకుండా, అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా కర్ణాటక, కేరళ, జార్ఖండ్, తమిళనాడు, పంజాబ్ వంటి విపక్ష పాలిత రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని మంత్రులు నిర్ణయించారు. అవసరమైతే అన్ని రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కమిటీ స్పష్టం చేసింది. త్వరలోనే న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరించి, మరో రెండు మూడు రోజుల్లో సబ్ కమిటీ రెండోసారి సమావేశం కానుంది. గ్రామీణ సంక్షేమం, ఉపాధి భద్రతను కాపాడేలా సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కమిటీ వెల్లడించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: