Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.

నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని​ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ఉదయం 11 గంటలకు పరిశీలిస్తారు. అలాగే భోగాపురంలో 17 వేల 900 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ​ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం పద్ధతిలో 5,640 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా నిర్మించారు. ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్‌సైడ్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజి హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటిలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు.

విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అదే స్థాయి ప్రమాణాలతో భోగాపురం ఎయిర్ పోర్టును సిద్ధం చేసింది. విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా.. పరిశ్రమలు, ఉపాధి, ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కేంద్రబిందువుగా మారేలా అల్లూరి సీతారామ రాజు ఎయిర్ పోర్టుకు రూపకల్పన చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటి. నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే కాకుండా, మొదట నిర్ణయించిన గడువుకంటే దాదాపు ఐదు నెలల ముందే సిద్ధం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు, ఎగుమతులకు, లాజిస్టిక్స్‌కు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక వసతిగా మారనుంది.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాడ్యులర్ విధానంలో భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. తొలి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్‌లో దశలవారీ విస్తరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ టెర్మినల్, ఎయిర్‌సైడ్, కమర్షియల్ మౌలిక వసతులను విస్తరించేందుకు వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం, వేగవంతమైన ప్రాసెసింగ్, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచేందుకు కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు, కామన్ యూజ్ పాసింజర్ ప్రాసెసింగ్ వ్యవస్థ, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, సెల్ఫ్ సర్వీస్ పాసింజర్ ప్రాసెసింగ్, స్మార్ట్ సర్వైవలెన్స్, యాక్సెస్ కంట్రోల్, సెక్యూర్టీ మేనేజ్మెంట్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: