పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన, అనుకూలమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, పార్టీలు మారవచ్చు కానీ, గత ప్రభుత్వాలు చేపట్టిన మంచి పనులను మేం కొనసాగిస్తాయని సీఎం స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను హైదరాబాద్కు రప్పించి పెట్టుబడులను ఆకర్షించిన తీరును ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు సాకారమయ్యాయన్నారు. తద్వారా ఫార్మా ఐటీ రంగాలు మరింత విస్తరించాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, తయారీ రంగంలో చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నగరాల పరంగా టోక్యో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్నామని ఆయన అన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో మూడు తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సుమారు 200 కంపెనీలు ముందుకు వచ్చాయని సీఎం తెలిపారు. డేటా సెంటర్ల స్థాపన కోసం అమెజాన్ సంస్థ 1 లక్ష కోట్లు, అదానీ గ్రూప్ రూ.35,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను తీసుకురావడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.