తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీలు ముందుకు సాగుతున్నారు .. డిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేష్ షెట్కార్ తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన నియోజకవర్గానికి కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు. సుమారు 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల పారిశ్రామిక, వాణిజ్య, రవాణా అభివృద్ధికి ఎంతో కీలకమని వివరించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ.. రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇక పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరైన రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎంపీ ప్రస్తావించారు. నిధుల విడుదల, పనుల అమలులో ఆలస్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిర్మాణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలాగే పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అప్‌గ్రేడేషన్ అంశాలపై కూడా మంత్రి, రైల్వే అధికారులతో చర్చించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేయడం, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.