Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Telangana మూసీ సుందరీకరణ పనులపై సీఎం ఫోకస్‌.

మూసీ సుందరీకరణ పనులపై సీఎం ఫోకస్‌.

by CVR NEWS

హైదరాబాద్‌లో మరో సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. మీరాలం చెరువు వద్దకు చేరుకున్న సీఎం.. జరుగుతున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మీరాలం చెరువుపై సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. భారీ క్రేన్‌ పైకి వెళ్లి.. చెరువులో జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని.. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్నో అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. చెరువు అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెరువు నిండిన సమయంలో వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా నాలాను విస్తరించాలని ఆదేశించారు. మీరాలం చెరువును కేవలం నీటి వనరుగా కాకుండా.. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. వాటర్‌ స్పోర్ట్స్‌కు అనువైన డిజైన్‌ రూపొందించాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. చెరువులో ఉన్న ఐలాండ్‌ను కూడా అభివృద్ధి చేసి.. సందర్శకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అంటే.. ఒకవైపు చెరువు పరిరక్షణ.. మరోవైపు వరద నీటి నిర్వహణ.. ఇంకోవైపు పర్యాటక అభివృద్ధి.. ఇవన్నీ కలిపి మీరాలం చెరువును సరికొత్త రూపంలో తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీరాలం చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే.. హైదరాబాద్‌కు మరో ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: