కూటమి పాలనలో విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో టౌన్ హాల్ సమావేశం సింగ్ నగర్ లోని గుజ్జుల సరళ దేవి కళ్యాణ మండలంలో నిర్వహించారు. జేఎన్‌టీయూ ముట్టడి కార్యక్రమానికి ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ పకడ్బందీగా పోరాటాలు చేసిందని తెలిపారు. అన్యాయానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు అండగా నిలబడి ఈ ఉద్యమాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంలో అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోవడంతో విద్యార్థులు, యువత తీవ్రంగా నష్టపోయారని దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ పాలనలో కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందించామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి నేతల అహంకారాన్ని దించే శక్తి ఒక్క యువతకే ఉందన్న ఆయన, రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ఉద్యమించాలని దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు.