టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఇవాళ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పుష్ప 2 రిలీజ్ టైమ్‌లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ సమన్లు జారీ చేసింది. ఇవాళ వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతారా..లేదంటే క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
2024 డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో సంధ్యా థియేటర్‌కు వచ్చిన హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. తగిన భద్రతా అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకపోవడం, సమన్వయ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తు తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ఆ ఛార్జిషీటును పరిశీలించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఇవాళ విచారణకు స్వయంగా హాజరు కావాలని అల్లు అర్జున్‌తో పాటు మరో 19 మందికి సమన్లు జారీ చేసింది.