ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సహా మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి రాఘవ్ చద్దా ఈమేరకు ప్రకటన చేశారు. 15 ఏళ్లుగా ఆప్‌కు అంకితభావంతో పనిచేశానన్నారు రాఘవ్ చద్దా. ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయతీ రాజకీయాలకు దూరమైందన్నారు. తాను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాననీ… అందుకే పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.తనతో పాటు మూడింట రెండొంతుల మంది ఆప్ పార్లమెంటరీ పార్టీ కూడా బీజేపీలో విలీనం అయ్యిందన్నారు.
గత కొంతకాలంగా పార్టీలో రాఘవ్ చద్దా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన్ను రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించారు. ఈ పరిణామం పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలోనే చద్దా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ నాయకత్వానికి ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది.





Total views : 140698