కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.2వేల పింఛను ఇస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను అని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కాకూడదు. తెలివితో ఓటు వేస్తేనే తెలివైన ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రం తలరాతను మార్చే ఓటును వివేకంతో వేయాలన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తే.. పింఛన్లు క్రమంగా రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నామన్నారు. జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిస్తే రైతు బంధు రూ.16వేలు వస్తాయన్నారు. అదే కాంగ్రెస్ వాళ్లు గెలిస్తే ఉన్న రైతు బంధు కూడా పోతుందని, ఇవన్నీ ప్రజలు గమనించాలని కేసీఆర్ కోరారు. నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయన్నారు. రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు.
సీఎం కేసీఆర్
ఈ నెల 13 నుండి 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటన మరో 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుండి 8 వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం గారు పర్యటన చేపట్టనున్నారు. రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు సీఎం కేసీఆర్ గారు 16 రోజులపాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ గారు పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది. దాంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది.
Read Also..
Read Also..
భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆగమాగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, కానీ ఆలోచించి ఓటేయాలన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలు, గాలిమాటలు చెబుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అన్నారు. ఈ ఓటును మంచిగా వినియోగించుకోవాలన్నారు. ప్రతిపక్షాల మాయలో ఎవరూ పడవద్దన్నారు. ఏ పార్టీ వైఖరి ఎలా ఉందో ప్రజలంతా పరిగణలోకి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో భైంసాలో రోడ్లు ఎలా వెడల్పు అయ్యారో అందరూ చూస్తున్నారన్నారు. కులం, మతం లేకుండా మనం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు దళితులను ఓటుబ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధును తీసుకువచ్చింది అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వచ్చాక ఎరువుల కొరత లేదన్నారు. భైంసాలో, ముధోల్లో ఇలా అన్నిచోట్ల హిందువులు, ముస్లింలు ఉన్నారని, కానీ భైంసాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కర్ఫ్యూలు, ధర్నాలు లేవన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని దూరం పెట్టాలన్నారు. అన్ని మతాలు, కులాల వాళ్లం కలిసి ముందుకు సాగుదామన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలిస్తేనే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల వేళ మూడు రోజుల వ్యవధిలో ప్రధాని రెండు సార్లు తెలంగాణకు రాబోతుండటం ఆసక్తిగా మారింది. గత నెలలో నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరుతామని గతంలో సీఎం కేసీఆర్ మా వెంట పడ్డారని, కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తానని మీరు ఆశీర్వాదించాలని కోరినట్లు మోడీ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఎన్నికల వేళ ఈసారి పర్యటనలో మోడీ మరోసారి కేసీఆర్ను ఎటాక్ చేస్తారా లేక హామీల వరకే పరిమితం అవుతారా అనేది ఆసక్తిగా మారింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధరణి, దళిత బంధు, రైతు బంధు వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. నాలుగు పైసలు ఉన్నంత మాత్రానా ఇంత అహంకారమా అంటూ ప్రశ్నించారు. అదే విధంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తడి తీసుకొచ్చిందని.. చచ్చినా ఆ పని చేయనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక సత్తుపల్లిలో 70వేల మెజార్టీతో సండ్ర గెలుపు ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలవనీయమని కొంతమంది మాట్లడుతున్నారని.. గడియారాలు, డబ్బులు పంచడం రాజకీయామా అంటూ ప్రశ్నించారు. 70రూపాయల గడియారం కావాలో ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. దళితుల శ్రేయస్సు కోసం బీఆరెస్ తప్ప ఎవరూ ఆలోచించరని వ్యాఖ్యానించారు.
నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నేడు తెలంగాణా భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి ఇరువురిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యత అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. నాగం జనార్ధన్ రెడ్డి సలహాలు, సూచనలు స్వీకరించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 కు 14 స్థానాలు గెలవాలని సీఎం సూచించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఈ మేరకు మాట్లాడారు. మనం సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయి. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పింది. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కత్తులతో మా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి. తస్మాత్ జాగ్రత్త! పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నడూ హింసకు దిగలేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచాం, చేతనైనకాడికి సేవ చేశాం. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. మా సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోం. ఇవాళ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ మీద జరిగిన దాడి నాపై జరిగిన దాడిగానే భావిస్తా. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోం. మేం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. ప్రజలకు ఎలా సేవ చేయాలనే ఆలోచనల్లో మేముంటే.. మీరు ఇలా దుర్మార్గమైన పనుల్లో ఉన్నారు. ఇది రాజకీయమా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్. నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పట్టణ శివారులో నిర్వహించే సభకు సుమారు లక్ష మంది జనం వస్తారని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి తెలిపారు. సభావేదికతో పాటు నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ మొత్తం గులాబీమయంగా మారిందని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరూ లేరని సైది రెడ్డిఅన్నారు.
మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వెళ్లడం, ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు.




Total views : 149778