పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. ఈ దాడుల్లో కీలక సైనికాధికారులు ఇద్దరు మరణించారు. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, బసీజ్ మిలీషియా అధిపతి..జనరల్ గులాం రెజా సాల్మనీ మృతి చెందారు. యుద్ధం తొలిరోజున సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్‌కు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడం మళ్లీ ఇదే మొదటిసారి. ఇరాన్లో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబం నుంచి లారిజానీ వచ్చారు. పార్లమెంటు మాజీ స్పీకర్‌గా, విధాన నిర్ణయ సలహాదారుగా, అణు వ్యవహారాల్లో ఖమేనీకి సలహాదారుగా పనిచేశారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా సేవలందించారు. బసీజ్ దళానికి అధిపతిగా ఉన్న సాల్మనీ.. ఇటీవల ఇరాన్లో జరిగిన అల్లర్లను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు. 1965లో జన్మించిన ఆయనపై అమెరికా, ఐరోపా కూటమి ఆంక్షలు విధించాయి.
మరోవైపు ఇరాన్, లెబనాన్ రాజధానులు టెహ్రాన్, బీరుట్లు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఉత్తర టెహ్రాన్‌లోని సాదాబాద్ ప్యాలెస్ ప్రాంతంతోపాటు మధ్య టెహ్రాన్, కరాజ్, షహర్యార్, షిరాజ్ నగరాలపై దాడులు జరిగాయి. ఇరాన్‌లోని కమాండ్, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. లెబనాన్‌లోని కఫార్లో జరిగిన దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఇటు గల్ఫ్‌తోపాటు ఇజ్రాయెల్‌పైనా ఇరాన్ దాడులను కొనసాగిస్తోంది. యూఏఈలోని ఫజైరా చమురు క్షేత్రంపై ఇరాన్ మళ్లీ డ్రోన్ దాడి చేసింది. అక్కడ ఉన్న చమురు నౌకపై ఈ దాడి జరిగింది. ఇరాన్ నుంచి డ్రోన్, క్షిపణి దాడుల భయంతో..కొద్దిసేపు యూఏఈ తన గగనతలాన్ని మూసివేసింది. ఆ తర్వాత విమానాలు యథావిధిగా తిరిగాయి. బనీ యాస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ పాకిస్థాన్ జాతీయుడు మరణించారు. 10 క్షిపణులు, 45 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది.





Total views : 140817