ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జలసంధిని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ దాడి చేసినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, పాకిస్థాన్ జెండా చాటున చమురును అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకుని, పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో సిబ్బంది ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుంది. తమ అనుమతి లేకుండా ఏ నౌక ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం స్తంభించిపోగా, 85కి పైగా ట్యాంకర్లు గల్ఫ్‌లోనే చిక్కుకుపోయాయి. మార్చి 11న కూడా థాయ్‌లాండ్‌కు చెందిన నౌకపై దాడి జరిగింది.ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. సంక్షోభం ముదరకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలోనే మరోసారి ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు బహ్రెయిన్, ఖతార్, యూఏఈ తదితర గల్ఫ్ దేశాలపై ఇరాన్ తన దాడులు కొనసాగించింది. చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’లో భాగంగా తమ దేశంలో నిర్మాణ దశలో ఉన్న ముబారక్ అల్ కబీర్ పోర్ట్‌పై దాడి జరిగిందని కువైట్ తెలిపింది. గల్ఫ్‌లో చైనా అనుబంధ ప్రాజెక్టుపై దాడి జరగడం ఇదే మొదటిసారి.
ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ నిల్వలు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు నిర్వహిస్తోంది. ఈదాడుల్లో బుషెహర్ ప్రావిన్సులోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ దాడులు బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌కు సమీపంలోనే జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనితో రేడియేషన్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరిగిన దాడులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అణు కేంద్రానికి జరిగే నష్టం, దీర్ఘకాలంలో రేడియోలాజికల్ ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించింది. ఆ ప్లాంట్‌లో పెద్ద మొత్తంలో అణుపదార్థాలు ఉన్నట్టు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసి పేర్కొన్నారు.ఎక్కువ మొత్తంలో అణుపదార్థాలు నిల్వ ఉన్న ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు ప్రమాదం జరిగితే, రేడియేషన్ లీకేజీ వల్ల ఇరాన్‌తో పాటు ఆ దేశం వెలుపల భారీస్థాయిలో ప్రమాదం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.




Total views : 140851