కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ హైటెన్షన్ తీగలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యవసాయ భూములపై ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా రైతులు ప్రాణభయంతో పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పొలం దున్నడం, వరి నాట్లు వేసే పనులు జోరుగా సాగుతున్న వేళ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర ఆధునిక వ్యవసాయ యంత్రాలను పొలాల్లోకి తీసుకెళ్లడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో వ్యవసాయ పనులు చేస్తున్నామని అంటున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాల్లో పనిచేసే సమయంలో భయం మరింత పెరుగుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూలీలు కూడా పనులకు రావడానికి వెనుకాడుతున్నారని పేర్కొంటున్నారు.ఈ సమస్యపై గత ఆరు నెలలుగా విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే బదులు, ముందస్తుగా చర్యలు తీసుకుని విద్యుత్ తీగలను సురక్షితమైన ఎత్తుకు మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అయితే, ఈ అంశంపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా, సమస్యపై సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని ఫోన్ ద్వారా వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా రాంపూర్ రైతులకు ప్రాణభయంగా హైటెన్షన్ తీగలు.
421
previous post