Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News మూసీ సుందరీకరణకు తొలి అడుగు.

మూసీ సుందరీకరణకు తొలి అడుగు.

by CVR NEWS

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఆగస్టు 5న ముందస్తు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. ఈ అనుమతి లభించడంతో, దసరా పండుగలోపే టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కసరత్తు వేగవంతం చేసింది.

హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర ‘వి’ ఆకారంలో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. దీని కోసం మొత్తం 7వేల 55 కోట్లు ఖర్చు చేయనుండగా, పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండేళ్లలోగా, అంటే 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది.

ఈ నిధులతో నదికి ఇరువైపులా 30 మీటర్ల వెడల్పుతో రోడ్లు, సర్వీసు రోడ్లు, ఫుట్‌పాత్‌లు నిర్మిస్తారు. మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు, పంపింగ్ స్టేషన్లు, వరద నియంత్రణకు చెక్ డ్యామ్‌లు ఏర్పాటు చేస్తారు. వీటికి తోడు పచ్చటి కారిడార్లు, పార్కులు, సాంస్కృతిక కేంద్రాలను కూడా నిర్మించనున్నారు. నదిలో సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా వర్షాకాలంలో 30 శాతం, ఇతర సమయాల్లో 20 శాతం నీటి ప్రవాహం ఉండేలా చూడనున్నారు.

మొదటి దశ కోసం మొత్తం 495 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 158 ఎకరాల ప్రభుత్వ, 146 ఎకరాల పట్టా, 30 ఎకరాల రక్షణ శాఖ భూములతో పాటు 126 ఎకరాల నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ పరిధిలో 639 శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే 2 వేల 660 చెట్లలో చాలావాటిని మరోచోటికి తరలించనున్నట్లు, తప్పనిసరిగా తొలగించాల్సి వస్తే 1:10 నిష్పత్తిలో కొత్త మొక్కలు నాటనున్నట్లు అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు.

మొత్తం మీద, కీలకమైన పర్యావరణ అనుమతులు లభించడంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులు మొదలుకానుండటంతో హైదరాబాద్ మహానగరానికి ఇది కొత్త శోభను తీసుకురానుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: