Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక కదలిక.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక కదలిక.

by CVR NEWS

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించేందుకు వార్ధా–వెయిన్‌గంగ నదులు కలిసే ప్రాంతమే అత్యంత అనువైన ప్రదేశమని సమగ్ర ప్రాజెక్టు నివేదిక స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణానికి నాలుగు ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అధికారులు.. చివరకు ఈ ప్రాంతాన్నే సిఫార్సు చేశారు.

150 మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టంతో.. 6.517 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో బ్యారేజీ నిర్మిస్తే గేట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని.. వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో ముంపు ఉండదని నివేదిక పేర్కొంది. అంతేకాదు మొత్తం ముంపులో 68 శాతం నదీ గర్భంలోనే ఉంటుందని తెలిపింది. గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని.. దీంతో పునరావాస సమస్య కూడా ఉండదని డీపీఆర్‌లో స్పష్టం చేశారు.

తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించి.. సుందిళ్ల బ్యారేజీకి తరలించి.. అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలని ప్రణాళిక రూపొందించారు. మొత్తం 80 టీఎంసీల నీటిని 90 రోజుల్లో మళ్లించేలా పథకాన్ని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందని డీపీఆర్ పేర్కొంది.

ఈ పథకం నిర్మాణ వ్యయాన్ని రూ.12,085 కోట్లుగా అంచనా వేశారు. 2025-26 ధరల ఆధారంగా ఈ అంచనాలను రూపొందించారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు ఇప్పటికే చేపట్టిన కాలువ పనులను పొడిగించడంతో పాటు.. టన్నెల్‌, గ్రావిటీ కాలువ నిర్మాణాలను కూడా ప్రతిపాదించారు.

ఇక బ్యారేజీ డిజైన్‌లో భాగంగా భారీ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. వార్ధా నదిపై 60 గేట్లు.. వెయిన్‌గంగపై 77 గేట్లతో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ముంపులో 80 శాతం మహారాష్ట్ర పరిధిలో.. 20 శాతం తెలంగాణలో ఉంటుందని నివేదిక వెల్లడించింది.

గతంలో ప్రాణహిత–చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే విధానాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. అయితే తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో.. ఇప్పుడు ఆ దిశగా డీపీఆర్‌ సిద్ధమైంది. ఈ డీపీఆర్‌ను నీటిపారుదల శాఖకు కన్సల్టెన్సీ సంస్థ అందజేయగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. డీపీఆర్‌ సిఫార్సుల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు భవిష్యత్‌ కార్యాచరణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: