Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Telangana హైదరాబాద్: నాచారం HMT నగర్‌ పెద్ద చెరువుకు మహర్దశ.

హైదరాబాద్: నాచారం HMT నగర్‌ పెద్ద చెరువుకు మహర్దశ.

by CVR NEWS
హైదరాబాద్: నాచారం HMT నగర్‌ పెద్ద చెరువుకు మహర్దశ

నిన్నటి వరకు అది ఓ కాలుష్య కాసారం. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధంతో.. నోరు తెరిస్తే చాలు దూరిపోయే దోమలతో అత్యంత దారుణమైన స్థితిలో ఉండేది. కానీ స్థానిక నాయకుల ప్రోద్బలంతో ఆ జలవనరు కొత్త రూపం సంతరించుకుంటోంది. కళ్లు చెదిరే హంగులతో అత్యంత సుందరమైన సరోవరంగా మారనుంది. ఇంతకీ ఆ చెరువు ఎక్కడుందో తెలుసా. హైదరాబాద్ నాచారం HMT నగర్‌లో.

నాచారంలోని పెద్ద చెరువు అంటే అందరికీ గుర్తొచ్చేది భయంకరమైన దుర్వాసన, ప్రాణాంతకమైన దోమల బెడదనే. గత నాలుగైదేళ్ల నుంచి అయితే ఆ చుట్టుపక్కల కాలనీల్లో ప్రజలు నివసించలేని దుస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల కాలనీల చెత్తా చెదారం, వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలు అన్నీ ఇందులోకే చేరడంతో ఈ చెరువు మురికి కూపంగా మారింది. విపరీతంగా గుర్రపుడెక్క పేరుకుపోయి దోమలకు ఆవాసకేంద్రంగా మారింది. దీనిపై అనేకసార్లు స్థానికులు ఆందోళన చేపట్టారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ చెరువు సుందరీకరణకు నడుము బిగించింది. HMT నగర్ పెద్ద చెరువు దగ్గర 37 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మిగతా చెరువుల సుందరీకరణ కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందే తడవుగా.. అధికారులు చురుగ్గా పనులు ప్రారంభించారు. చెరువులోని మురుగునీటిని బయటకు పంపి గుర్రపు డెక్కను తొలగించే పని చేపట్టారు. అలాగే పేరుకుపోయిన అవశేషాలను, బురదను తోడేస్తున్నారు. చెరువు కట్టకు కూడా మరమ్మతులు చేపట్టి… మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే దిశగా పనులు చేపట్టారు. ఇన్నేళ్లు మురికి కూపంగా ఉన్న HMT చెరువు రూపురేఖలు క్రమంగా మారిపోతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధితో పనులు చేపట్టిన ప్రభుత్వాన్ని, నాయకులను అభినందిస్తున్నారు.

చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు, బతుకమ్మ వేడుకల కోసం ఓ ఘాట్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటి పెద్ద చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
ఇంతకాలం సమస్యల వలయంగా నిలిచిన HMT నగర్‌ పెద్ద చెరువు అతి కొద్ది కాలంలోనే సుందరమైన తటాకంగా మారనుండడం… స్థానికుల్లో ఆనందాన్ని నింపుతోంది. అన్నీ కుదిరితే.. వచ్చే బతుకమ్మ వేడుకను ఈ చెరువులోనే సంతోషంగా జరుపుకునేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: