Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

by CVR NEWS
వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆయా జిల్లాల్లోనే బస చేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

జులై 1న తన పర్యటనను సంక్షేమ కార్యక్రమంతో ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు తిరుపతి జిల్లా శ్రీ సిటీకి చేరుకుంటారు. అక్కడ ప్రముఖ బైకుల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతిలోనే బస చేస్తారు.

జులై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వీబీజీ రామ్‌జీను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగే జీఎస్‌డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌కు హాజరవుతారు. ఈ కీలక సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా పాల్గొననున్నారు. రెండో రోజు రాత్రి కూడా సీఎం తిరుపతిలోనే బస చేస్తారు.
పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా జులై 3న కడప జిల్లా పర్యటన ఉండనుంది. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన స్టీల్ ప్లాంట్ పనులకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను లాంఛనంగా ప్రారంభించి, ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయనున్నారు.

స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించిన అనంతరం, చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు బయలుదేరి వెళతారు. జులై 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. మూడు రోజుల కుప్పం పర్యటన ముగించుకుని జులై 5న తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఈ ఐదు రోజుల పర్యటన ద్వారా ఒకేసారి సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: