229
విశాఖపట్నంలోని మధురవాడలో భారీ చోరీ కలకలం రేపింది. జంక్షన్‌లో ఉన్న రామ్మోహన్ నాయుడు జువెలరీ షాపును లక్ష్యంగా చేసుకున్న దొంగలు అత్యంత పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక మార్కెట్ వైపు నుంచి గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు 20 కిలోల వెండి ఆభరణాలు, వరలక్ష్మి కాసులను అపహరించారు. ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు షాపులోని సీసీ కెమెరాలు, డీవీఆర్‌ను కూడా వెంట తీసుకెళ్లడం గమనార్హం. అయితే ప్రధాన బంగారు ఆభరణాలు ప్రత్యేక లాకర్‌లో భద్రంగా ఉండటంతో అవి దొంగల చేతికి చిక్కలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు, క్రైమ్ విభాగం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పక్కనే ఉన్న దుకాణాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.