Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News కామన్వెల్త్‌ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.

కామన్వెల్త్‌ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.

by CVR NEWS

కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత అథ్లెట్లను ప్రధాని అభినందించారు. వివిధ క్రీడా విభాగాల్లో రాణిస్తున్న క్రీడాకారులను దేశ ప్రజలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులతో ప్రధాని మోదీ జరిపిన ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘జో ఖేలేగా, వో ఖిలేగా’ అంటూ యువ క్రీడాకారులను మోదీ మరోసారి ప్రోత్సహించారు. భారత క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని.. ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ పిలుపునిచ్చారు. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో పలు ప్రధాన క్రీడాంశాలను తొలగించినప్పటికీ.. భారత్‌ పతకాల పట్టికలో టాప్‌-5లో నిలిచింది. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా.. అందులో 7 స్వర్ణ పతకాలు ఉన్నాయి. జూడోలోనూ భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. అస్మితా దే, హర్ష్‌ సింగ్‌ స్వర్ణ పతకాలు సాధించారు. ఈ విభాగంలో భారత్‌ మొత్తం నాలుగు పతకాలను ఖాతాలో వేసుకుంది. అథ్లెటిక్స్‌లో గుల్వీర్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 వేల మీటర్ల పరుగులో రజతం, 5 వేల మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించాడు. ఒకే కామన్వెల్త్‌ గేమ్స్‌ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా గుల్వీర్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. పారా అథ్లెట్లు సైతం సత్తా చాటారు. మహిళల F57 షాట్‌పుట్‌లో శర్మిలా ధంకర్‌ స్వర్ణ పతకం సాధించి.. పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి కామన్వెల్త్‌ స్వర్ణాన్ని అందించింది. పురుషుల 100 మీటర్ల T47 విభాగంలో దిలీప్‌ మహదు గవిట్‌ స్వర్ణ పతకం సాధించాడు. తదుపరి కామన్వెల్త్‌ గేమ్స్‌ భారత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో.. సొంతగడ్డపై భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే అవకాశాలున్నాయని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: