రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసులో విషాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో సికింద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం 3.22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
రాజమహేంద్రవరంలో ఓ మాల్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రియాంక స్కూటీని నిందితులు కారుతో ఢీకొట్టారు. తొలుత ఈ ఘటనను పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా పరిగణించారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక స్కూటీని పలుమార్లు కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరా ఆధారాలతో కేసులో సెక్షన్లను మార్చిన పోలీసులు.. ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని నిర్ధారించారు. ప్రియాంకపై హత్యాయత్నం జరిగినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇప్పటికే వెల్లడించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ప్రియాంకకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సీరియస్గా పరిగణించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టినట్లు నిర్ధారించడంతో కేసును మరింత తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంక మృతితో ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది.