పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
International
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం, కేవలం గత వారం రోజుల్లోనే మార్చి 1 నుండి 7 వరకు దాదాపు 67,000 మంది భారతీయులను ప్రత్యేక విమానాలు, వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చారు. ఇందులో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తెలంగాణ నుండి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, గల్ఫ్ దేశాల్లోని వివిధ తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవాస ఆంధ్రుల భద్రత కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు * ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ రంగంలోకి దిగింది. ఇప్పటికే బహ్రెయిన్ , దుబాయ్‌లో చిక్కుకుపోయిన సుమారు 107 మందిని ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మందికి పైగా వ్యక్తులు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సుమారు 100 మంది గుడ్‌విల్ అంబాసిడర్లు గల్ఫ్ దేశాల్లో తెలుగు వారికి వసతి , రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం విమాన ప్రయాణాలే కాకుండా, సముద్ర మార్గంలో చిక్కుకున్న నావికుల భద్రతపై కూడా దృష్టి పెట్టింది. ఢిల్లీలో 24/7 పనిచేసే స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్‌స్పేస్ పాక్షికంగా మూసివేసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారతీయులను తరలిస్తున్నారు. కువైట్ నుండి రియాద్‌కు రోడ్డు మార్గంలో తరలించి, అక్కడి నుండి విమానాల ద్వారా భారత్‌కు చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది.
ఉపాధి నిమిత్తం వెళ్ళిన వారి కంటే, విజిటింగ్ వీసాపై వెళ్ళిన వారు , విమానాశ్రయాల్లో చిక్కుకున్న వారు స్వదేశానికి తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోనే ఉండి పనిచేస్తున్న వారు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారని, అయితే స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని రాయబార కార్యాలయాలు సూచిస్తున్నాయి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ భవన్ల ద్వారా కూడా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, యుద్ధం తీవ్రతరం అయితే భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. యుద్ధ క్షేత్రం నుండి తిరిగి వస్తున్న వారిని చూసి గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో కొంత ఉపశమనం కనిపిస్తున్నా, అక్కడ ఉండిపోయిన వారి గురించి ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది.
నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను కాదని.. నవతరం వైపు మొగ్గు చూపారు నేపాలీలు. పాత పార్టీలను తుడిచిపెట్టిన బాలెన్ షా పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో 165 స్థానాలకు గాను 163 స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఆర్ఎస్పీ ఏకంగా 125 సీట్లలో విజయభేరి మోగించింది. మొత్తం 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో బాలెన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ అధికారం చేపట్టనుంది.
ఈ ఎన్నికల సునామీలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా ఎందరో రాజకీయ హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఆర్ఎస్పీ ప్రధాని అభ్యర్థి, ఖాట్మండు మాజీ మేయర్ బాలెన్ షా.. ఓలీకి కంచుకోటగా భావించే ఝాపా-5 నియోజకవర్గంలో ఆయనపై ఘనవిజయం సాధించారు. నేపాల్ పార్లమెంటరీ చరిత్రలోనే ఏ అభ్యర్థికి రానన్ని అత్యధికంగా 68,348 ఓట్లను బాలెన్ షా దక్కించుకున్నది. మరోవైపు, నేపాలీ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావించిన గగన్ థాపా కూడా ఆర్ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు.ఎఫ్‌పీటీపీ విధానంలోనే కాకుండా, దామాషా ప్రాతినిధ్య పద్ధతిలోనూ ఆర్ఎస్పీ 48 శాతానికి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఈ ట్రెండ్ కొనసాగితే, 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆర్ఎస్పీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో దాదాపు 184 సీట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 1991 తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా ఇంతటి భారీ మెజారిటీని సాధించలేదు.ఈ చారిత్రక తీర్పుతో నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.
పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది. సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటోంది..అంతర్జాతీయ నిబంధనలనను అమెరికా ఉల్లంఘిస్తోందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..అమెరికా చర్యలకు అక్కడ సెనెట్ ఆమోదించినా…ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి..రష్యా-చైనా-ఉత్తర కొరియా, క్యూబా కొన్ని అరబ్ దేశాలు అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి..ఖమేనీ హత్యను ఖండించాయి. ఈ క్రమంలోనే యుద్ధ సమీకరణలు కూడా మారిపోతున్నాయి. అమెరికా-ఇజ్రాయిల్ కు మద్దతుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ క్షిపణి దాడులు ముమ్మరం చేసింది. గల్ఫ్ లోని అమెరికా స్థావరాల దాడులకు కారణంగా ప్రభావితమైన ఆయా దేశ ప్రజలకు ఇరాన్ క్షమాపణలు చెబుతూనే..ఇజ్రాయిల్ -అమెరికాలకు సోదర దేశాలైన గల్స్ దేశాలు మద్దతు ఇవ్వకూడదని కోరుతోంది. యుద్ధాన్ని కొనసాగిస్తామని చెబుతోంది ఇరాన్…ఇజ్రాయిల్-అమెరికాలు మాత్రం ఇరాన్ లొంగిపోవాలని..లేదంటే లొంగిపోవడానికి ఎవ్వరూ మిగలరని హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..
ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్‌కు రష్యా ‘రియల్ టైమ్ ఇంటెలిజెన్స్’ సహకారం అందిస్తోందని వార్తలు కలువరపెడుతున్నాయి. యుద్ధం తీవ్రమవుతున్న వేళ, అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధనౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేసిందని నిపుణుల విశ్లేషణలు వెలువడుతున్నాయి
యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్.. అమెరికా దళాలను కనిపెట్టే శక్తిని చాలావరకు కోల్పోయింది. అయినా అగ్రరాజ్య సైనిక లక్ష్యాలపై దాడులు చేయగలుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ వేల సంఖ్యలో వన్-వే ఎటాక్ డ్రోన్లను, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలనూ దెబ్బతీస్తోంది.
రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్‌కు లభిస్తున్నాయని, అందుకే దాని లక్షిత దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగడుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా, తన నిఘా, టార్గెటింగ్ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్ తన ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని దాడులు చేయగలుగుతోంది. కాగా..ఇరాన్‌కు రష్యా సహకారం అందిస్తోందనే అంశంపై స్పందించడానికి అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ, రక్షణ శాఖ నిరాకరించాయి.
అయితే..ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు, ఇంటెలిజెన్స్ సహకారం అందించింది. ఉక్రెయిన్ నగరాలపై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోంది. అయినప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో రష్యా నేరుగా ప్రవేశించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దేశానికి ఉక్రెయినే మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు. కానీ ..రష్యా ఇరాన్ కు వ్యూహాత్మక సాయం చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్‌కు రష్యా ‘రియల్ టైమ్ ఇంటెలిజెన్స్’ సహకారం అందిస్తోందని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి..అమెరికా యుద్ధనౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేసిందని వెల్లడించింది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్‌కు లభిస్తున్నాయని, అందుకే ఇరాన్ దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగడుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా, తన నిఘా, టార్గెటింగ్ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు చేయగలుగుతోంది.
ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు, ఇంటెలిజెన్స్ సహకారం అందించింది. ఉక్రెయిన్ నగరాలపై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు..ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన IRS దేనా నౌక..ఇటీవల విశాఖలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా..శ్రీలంక తీరంలో దాడి చేసింది అమెరికా. దీంతో ఇరాన్ నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులోని 140 మందికిపైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. ఈ నౌక గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు..ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందించింది.
దీంతో శ్రీలంక ఎయిర్‌ఫోర్స్, నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న 32 మందిని కాపాడారు. వారు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇక ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, ఇప్పటివరకు 87 మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు లంక అధికారులు. ఇరాన్ నౌక ప్రమాదానికి గురైన విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. నౌకలో దాదాపు 180 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ దాడి తామే చేశామని అమెరికా ప్రకటించింది. తమ జలాంతర్గామి నుంచి టోర్పెడోను ప్రయోగించి ఇరాన్ యుద్ధనౌకను ముంచివేశామని ఆ దేశ రక్షణశాఖా మంత్రి తెలిపారు. శత్రు దేశానికి చెందిన యుద్ధనౌకపై ఇలాంటి దాడి జరగడం రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇదే మొదటిసారని వెల్లడించారు.
ఇరాన్ అధికారికంగా హర్ముజ్ జలసంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1 వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
కాగా, హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది.
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ కొంత మేర పైప్‌లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ, మొత్తం సరఫరాకు అవి సరిపోవు. 1980లలో ఇరాన్-ఇరాక్ ‘ట్యాంకర్ యుద్ధం’ తర్వాత పూర్తిస్థాయిలో హర్మూజ్ మూసివేత జరగలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6 శాతం పెరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. తాజాగా లెబనాన్ భూభాగంలోకి మరింత లోపలికి చొచ్చుకుపోయింది. ఇజ్రాయెల్ బలగాలు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లి, దక్షిణ లెబనాన్ పట్టణమైన ఖియామ్ లోకి ప్రవేశించినట్లు లెబనీస్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఖియామ్ పట్టణంలో ఇజ్రాయెల్ సైన్యం నిరంతర ఆర్టిలరీ షెల్లింగ్‌తో భీకర దాడులకు పాల్పడుతోందని, శత్రు బలగాలు పట్టణంలోకి ప్రవేశించాయని స్థానిక మీడియా నివేదించింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే, దానికి సమాంతరంగా ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతం గుండా ఈ దాడులకు దిగినట్లు లెబనీస్ సైనిక వర్గాలు తెలిపాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వీడ్కోలు కార్యక్రమం వాయిదా పడింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఐదో రోజుకు చేరుకోవడం, దాడుల తీవ్రత పెరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారంలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన మషాద్ నగరంలో నిర్వహించనున్నారు. అక్కడి ప్రసిద్ధ ఇమామ్ రజా మసీదు ప్రాంగణంలోనే ఖమేనీ తండ్రి సమాధి కూడా ఉంది. 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరామ్కో కు చెందిన అతిపెద్ద రిఫైనరీ రాస్ తనురా పై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది. ఈ విషయాన్ని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడి వల్ల ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇరాన్ తయారీ షాహెద్ సూసైడ్ డ్రోన్లతో జరిగిన దాడి కారణంగా అరామ్కో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. తాజాగా జరిగిన దాడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫస్ట్ అటాక్ తర్వాత అరామ్కో ఇప్పటికే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ , ప్రోపేన్, బ్యూటేన్ ఎగుమతులను కొన్ని వారాల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది.మ రోవైపు హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా ప్రమాదకరంగా మారడంతో, సౌదీ అరేబియా తన ఎగుమతులను రెడ్ సీ మీదుగా తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ 1.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 82.53 డాలర్లకు చేరింది..ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా వద్ద ఉన్న క్షిపణి, ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై చర్చలు జరపడానికి రక్షణరంగ కాంట్రాక్టర్లను, ఇతర ఉన్నతాధికారులను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు ఆహ్వానించినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.ఇరాన్‌తో కొనసాగుతోన్న యుద్ధంలో భారీగా క్షిపణులను వినియోగించడంతో.. తగ్గిపోతున్న ఆయుధాగారాన్ని తిరిగి నింపడానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాయి. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అగ్రరాజ్యం ఉక్రెయిన్‌కు భారీగా సైనిక సహాయం అందిస్తుండడంతో.. ఆ దేశం వద్ద ఉన్న నిల్వలు తగ్గినట్టు తెలుస్తోంది. మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పెంటగాన్ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమయ్యారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది. శక్తివంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) అని పిలవబడే రక్షణ దళం భద్రతా నిఘాలో ఉండే ఖమేనీ హత్య చేయడం అంతా ఈజీ పని కాదు. కానీ తాజాగా ఇజ్రాయెల్,అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించాడు. అయితే ఖమేనీ మృతి వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తమ దేశ ప్రభుత్వం ఖమేనీని ఎలిమినేట్ చేయాలని పెట్టుకున్న లక్ష్యం కోసం ఎవరూ ఊహించని రీతిలో అతడి కదలికలను పసిగట్టి దేశానికి చేరవేసింది. మొస్సాద్ ఇచ్చిన అత్యంత కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన ఇజ్రాయెల్, అమెరికా దళాలు అంతే కచ్చితత్వంతో ఖమేనీపై ఎటాక్ చేసి చంపేశాయి. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్ మొస్సాద్ ఇట్టే పసిగడుతుందనే పేరుంది. ఖమేనీని అంతం చేయడంతో ప్రపంచంలో మరోసారి మొస్సాద్ పేరుపై జోరుగా చర్చ జరుగుతోంది. శత్రువు టార్గెట్ ఫిక్స్ అయితే వారిని స్మాష్ చేసేందుకు మొస్సాద్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో ఓ సారి చూద్దాం..
ఇరాన్ సుప్రీం నేతను ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‌కు ఇదంత తేలికగా సాధ్యం కాలేదు. ఇందుకోసం అనేక ఏళ్లు అనేక రకాలుగా మొస్సాద్ నిఘా కొనసాగించింది. చివరకు ట్రాఫిక్ కెమెరాల నెట్ వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ హ్యాక్ చేసి ఖమేనీ ప్రతి కదలికను ట్రాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో కొన్ని ఏళ్ల పాటు ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ కు పాల్పడిన మొస్సాద్ వాటి ఫుటేజ్ ను ఎన్ క్రిప్ట్ చేసి స్వదేశానికి పంపించింది. ఖమేనీ కార్యాలయంలో రోజువారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్? ఖమేనీ ఎక్కడ ఉంటారు? ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు? ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవుతారు? ఏదైనా ఆపద సమయం వస్తే ఎక్కడికి వెళ్తారు అనే వివరాలన్ని క్షుణ్ణంగా పసిగట్టింది. ఆ సమచారం అంతా ఎప్పటికప్పుడు తమ దేశానికి చేరవేసింది. ఈ క్రమంలో ఏఐ టూల్స్, అర్గరిథమ్స్ ను కూడా ఉపయోగించిందని, ఇలా సేకరించిన పూర్తి సమాచారంతో ఫిబ్రవరి 28న ఎటాక్ చేసి చంపేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.
మొస్సాద్ తాను పెట్టుకున్న టార్గెట్‌ను పూర్తి చేసేందుకు ఎంత కసిగా ఉంటుందో అంతే ఓర్పుతో ఎగ్జిక్యూట్ చేస్తుందనడానికి ఈ సంస్థ 1978లో చేపట్టిన ఆపరేషన్ స్యాడ్ నెస్ బెస్ట్ ఎగ్జామ్ పుల్. 1976 లో ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా సంస్థ చీఫ్ హద్దాద్ నేతృత్వంలో ఎయిర్ ఫ్రాన్స్ హైజాక్ చేశారు. హైజాకర్లు విమానాన్ని టెల్ అవీవ్ నుంచి పారిస్‌కు ఆ తర్వాత లిబియా, ఉగాండాకు తరలించుకుపోయారు. ఇజ్రాయెల్ దీన్ని ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’తో తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయినా ఈ మిషన్‌కు నేతృత్వం వహించిన లెఫ్టినెంట్ కర్నల్ యొనాతన్ నెతన్యాహు మృతి చెందారు. ఈయన ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్వయాన సోదరుడు. యొనాతన్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న మొస్సాద్ హద్దాద్‌ను టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఆపరేషన్ కు ‘ఏజెంట్ స్యాడ్ నెస్’ అని నామకరణం చేసింది. హద్దాద్ ఇల్లు, కార్యాలయంలోకి వెళ్లగలిగే ఓ వ్యక్తిని తమ ఉచ్చులోకి లాకుంది. అలా 1978 జనవరి 10న ఈ ఆపరేషన్ ద్వారా తన టార్గెట్ ను పూర్తి చేసింది. అయితే తమ ట్రాప్‌లోకి తీసుకున్న హద్దాద్ ఇంట్లోకి వెళ్లగలిగే వ్యక్తి చేత హద్దాద్ రోజూ ఇంట్లో వాడే టూత్ పేస్ట్ స్థానంలో ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్‌లో తయారు చేసిన స్పెషల్ టూత్ పేస్ట్ ను ఉంచేలా చేయగలిగింది. అంతే కాదు ఆ పేస్ట్ ను హద్దాద్ ఉపయోగించేలా ప్లాన్ చేశారు. విషపూరిత రసాయనాలతో చేసిన ఆ పేస్ట్ వినియోగించిన హద్దాద్ కొన్ని రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు.
2024లో లెబనాన్‌లోని హెజ్ బొల్ల మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది మంది తమ వద్ద ఉన్న పేజర్లు పేలి మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల వెనుక కూడా మొస్సాద్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పేజర్ అంటే రేడియో తరంగాల ద్వారా సంక్షిప్త సందేశాలను పంపే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు ప్రాచుర్యంలోకి రాకముందు ప్రపంచవ్యాప్తంగా పేజర్లను విస్తృతంగా వినియోగించేవారు.
మొస్సాద్ ఇప్పటివరకు హతమార్చిన మరికొంత మంది వివరాలు చూద్దాం. 2024లో హమాస్ సీనియర్ కమాండర్ ఆమన్ షొవదేపై గగనతల దాడి చేసి హతం చేసింది మొస్సాద్. ఆదే సంవత్సరం ఇజ్రాయెల్ పౌరులు, యూదులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారనే ఆరోపణలపై హదీ ముస్తఫా అనే వ్యక్తిని డ్రోన్ దాడితో హతమార్చింది.
2018లో హమాస్ ఆయుధ నిపుణుడు ఫదీ ముహమ్మద్ అల్ బాత్ష్ ఓ మసీదుకు వెళ్లేందుకు కౌలాలంపూర్‌లో ప్రయాణిస్తుండగా మోటారు సైక్లిస్టులుగా వచ్చినవారు కాల్పులు జరిపి హతమార్చారు.
2009లో హమాస్ రాజకీయ నేతల్లో కరడుగట్టినవాదిగా పేరొందిన మతపెద్ద నిజార్ రయ్యన్పై జరిపిన దాడిలో ఆయనతో పాటు ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలు హతమయ్యారు. 2004లో గాజా నగరంపై మాస్టర్ బాంబర్‌తో గగనతల దాడి జరిపి సైన్యంలో నంబరు-2గా ఉన్న అద్నాన్ అల్ ఘౌల్ ను హతం చేసింది మొస్సాద్. 2004లో కారుపై క్షిపణితో దాడిచేసి హమాస్ నేత అబ్దెల్ అజీజ్ అల్ రంటిస్సిని హత్య చేసింది. 2004లో హమాస్ ఆధ్యాత్మిక నేత అహ్మద్ యాసిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై క్షిపణి దాడికి పాల్పడింది.
గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించడంలో నిష్ణాతులు ఉన్న మొస్సాద్ చరిత్రలో జరిగిన కొన్ని ప్రధాన వైఫల్యాలు కూడా ఉన్నాయి.
1951లో బాగ్దాద్ స్పై రింగ్ : ఇది మొస్సాద్ ప్రారంభ దశలో జరిగిన అతిపెద్ద వైఫల్యం. ఇరాక్‌లో ఇజ్రాయెల్ గూఢచారుల బృందం పట్టుబడటంతో, ఆ బృందానికి చెందిన పలువురు అధికారులు అరెస్టు అయ్యారు. ఇది ఇజ్రాయెల్‌కు తీవ్రమైన ఇబ్బందిని కలిగించింది. 1954లో ఆపరేషన్ సుసన్నా : ఈజిప్టులో పశ్చిమ దేశాల ఆస్తులపై బాంబు దాడులు చేసి, ఆ నిందను స్థానిక ఉగ్రవాదులపైకి నెట్టేందుకు చేసిన “ఫాల్స్ ఫ్లాగ్” కుట్ర ఇది. అయితే, ఒక బాంబు అనుకోకుండా ముందే పేలడంతో ఈ మొత్తం కుట్ర బయటపడింది. దీనివల్ల గూఢచారి బృందం అరెస్టు కావడమే కాకుండా, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
1973లో లిల్లీహామెర్ ఎఫైర్ : 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ ఊచకోతకు ప్రతీకారంగా మొస్సాద్ చేపట్టిన ‘ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్’లో భాగంగా ఇది జరిగింది. నార్వేలో మొస్సాద్ ఏజెంట్లు తప్పుడు సమాచారంతో ఒక అమాయకపు మొరాకో వెయిటర్‌ను పొరపాటున హతమార్చారు. దీనివల్ల నార్వేలో ఆరుగురు ఏజెంట్లు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు.
1997లో ఖలీద్ మెషాల్ హత్యాయత్నం : జోర్డాన్‌లో హమాస్ నాయకుడు ఖలీద్ మెషాల్‌ను విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించిన మొస్సాద్ ఏజెంట్లు అక్కడే పట్టుబడ్డారు. దీనివల్ల ఇజ్రాయెల్ తీవ్ర దౌత్యపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. చివరకు తమ ఏజెంట్లను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ ఆ విషానికి విరుగుడును అందించాల్సి వచ్చింది, అంతేకాకుండా హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్‌ను జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. 2004లో న్యూజిలాండ్ పాస్‌పోర్ట్ స్కాండల్ : న్యూజిలాండ్ పాస్‌పోర్టులను అక్రమంగా పొందడానికి ప్రయత్నించిన ఇద్దరు అనుమానిత మొస్సాద్ ఏజెంట్లు పట్టుబడ్డారు. ఇది ఇజ్రాయెల్, న్యూజిలాండ్ మధ్య ఏడాది పాటు దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఇరాన్‌తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అయినప్పటికీ ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది.అణ్వాయుధాల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ మొండిగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అణ్వాయుధాల తయారీని కొనసాగిస్తూ వచ్చిందని తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తమ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయలేదని పేర్కొంది. అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ చేతిలో చావు తప్పదని హెచ్చరిక చేశారని తెలిపింది. కానీ ఇప్పుడు ఈ యుద్ధంలో ఖమేనీయే హతమయ్యారని ఆ ప్రకటనలో వెల్లడించింది.యుద్ధం ఇరుపక్షాలకు నష్టం చేకూరుస్తుందని అమెరికా రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తాము యుద్ధానికి సిద్ధమైంది ఇరాన్లో పాలన మార్చాలనే ఉద్దేశంతో కాదని, కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే దాడులు చేశామని తెలిపింది. అణు స్థావరాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది.
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ హత్యపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఖమేనీ ప్రోద్బలంతో తనపై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయని వెల్లడించారు. అతడు నన్ను పట్టుకోకముందే నేనే అతడ్ని పట్టుకున్నానని వ్యాఖ్యానించారు. ఇరాన్ తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని వెల్లడించారు. కాగా ఇరాన్ పై జరిగిన దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారన్నారు. అంతా సవ్యంగానే జరుగుతోందన్నారు. ఈ దాడులు ఇప్పుడు ప్రారంభించకుంటే రెండు వారాల్లోనే అణ్వాయుధాలను ఇరాన్ సంపాదించి ఉండేదని ట్రంప్ గుర్తుచేశారు. చమురు ధరలపై ఆందోళన అవసరం లేదని ట్రంప్ తెలిపారు. అంతా మంచే జరుగుతుంది. ఆందళన చెందొద్దు అని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇరాన్ పై దాడుల కోసం అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోకపోవడం అమెరికాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. డెమోక్రాట్లతో పాటు సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు కూడా ట్రంప్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధ యుద్ధమని ఆరోపిస్తున్నారు. ఇది అమెరికా కాంగ్రెస్‌పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఎలాంటి తక్షణ ముప్పు లేనప్పుడు అధ్యక్షుడు చట్టవిరుద్ధంగా యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ కాంగ్రెస్‌తో సంప్రదించే నిర్ణయం తీసుకున్నారని కాలిఫోర్నియా డెమోక్రాట్ ప్రతినిధి రో ఖన్నా తీవ్రంగా విమర్శించారు. కెంటకీ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీ, సెనేటర్ రాండ్ పాల్ వంటి కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పారన్నారు.. యుద్ధం ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, ఇది ‘అమెరికా ఫస్ట్’ విధానం కాదని వారు స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్లో పాలన మార్పు లక్ష్యంగా ఆ దేశంపై భారీ సైనిక దాడులకు ట్రంప్ ఆదేశించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన ఇరాన్ తక్షణమే ప్రతీకార దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. దీనంతటికీ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయాల ఫలితమేనన్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా ఓటింగ్ జరపాలని, ఇందుకోసం కాంగ్రెస్‌ను తక్షణమే సమావేశపరచాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వారం మధ్యలో దీనిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే, స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ వంటి రిపబ్లికన్ అగ్ర నాయకులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. అధ్యక్షుడికి రాజ్యాంగబద్ధంగా ఈ అధికారం ఉందని వాదిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ తన ప్రతీకార దాడులను ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విస్తరిస్తుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.





Total views : 141341