కడప జిల్లా.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియాన్ల నాయకులు మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే అంగన్వాడి కేంద్రాలను మూసివేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చామని దీనికి కారణం ప్రభుత్వమేనని చెప్పారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలుగా పనులు చేస్తున్నామని కేవలం 11 వేల రూపాయల జీతంతో ఎలా మా కుటుంబాలు పోషించుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టోర్ డీలర్లు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద దించకుండా వీధుల వెంట పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు.
Anganwadi
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అంగన్వాడి సిబ్బంది నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మద్దతు ఇచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు కలిపి అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కె.ఏ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తూ ప్రమోషన్ అమలు చేయాలని చెప్పారు. అంగన్వాడి విధులలో రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, చాలా నిబంధనలు అమలు చేయాలని మరియు సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన..ఆందోళన చేపట్టనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు.. అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడి కార్యకర్తలు.ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రం తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు 26 వేల జీతము , ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేనిపక్షంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెలో పాల్గొన్నారు.
4ఏళ్ల నుండి పెండింగులో పెట్టిన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డిఓ ఆఫీస్ పక్కన కాకినాడ అర్బన్, రూరల్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనం చెల్లిస్తానన్న జగన్మోహన్ రెడ్డి హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అంగన్వాడీలకు చెల్లించాలని, 2017 నుండి బకాయి పెట్టిన టిఏ బిల్లులు చెల్లించాలని, మినీ వర్కలను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని కోరుతూ డిసెంబర్ 8వ తేదీ నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ సెంటర్లను మెర్జ్ చేశారని, నూతన విద్యా విధానం పేరుతో ఉన్న సెంటర్లను సైతం పాఠశాలల్లో విలీనం చేయడంవల్ల రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలకు పౌష్టికాహారం దూరమవుతుందని విమర్శించారు. బాలింతల ఇంటికి వెళ్లి ఫేస్ రికగ్నైజింగ్ చేసే యాపుల పని అంగన్వాడీలకు భారంగా మారిందన్నారు. సెంటర్లు వదిలేసి ఎఫ్.ఆర్.సి యాప్ పేరుతో ఇళ్ల చుట్టూ తిప్పుతూ, అధికారులు, రాజకీయ నాయకులు విజిట్ల పేరుతో సెంటర్ కి వచ్చే సమయంలో అంగన్వాడీ కనపడకపోతే మెమోలు ఇస్తూ అంగన్వాడీలను మానసిక వేదనకు, రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. తక్షణం అన్ని యాప్లను కలిపి ఒకే యాప్ గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆయాల ప్రమోషన్ వయస్సు 50సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం పక్కనపెట్టి నిబంధనలకు విరుద్డంగా కాకినాడ నగర ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆ పార్టీల బోగస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు ఆగం కావొద్దని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ ఏ1, బీజేపీ ఏ2 అని అన్నారు. మనం వెనుకబడటానికి కారణం కూడా ఈ రెండు పార్టీలేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాని చెప్పారు. తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం అంగన్ వాడీ కార్యకర్తలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని హరీశ్ మండిపడ్డారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ వేతనాలను చెల్లిస్తోందని చెప్పారు. త్వరలోనే పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి… ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న ప్రధాని మోదీ ఇక్కడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.




Total views : 150098